-జిల్లా కలెక్టర్ డా. జి. సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గిరిజన ఆశ్రమ పాఠశాలల ద్వారా గిరిజన విద్యార్థులకు అత్యుత్తమ విద్యా బోదనను అందించి రానున్న విద్యా సంవత్సరంలో నూరు శాతం ఉత్తమ ఫలితాలను సాధించేలా కృషి చేయాలని ఎ కొండూరు గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ డా. జి. సృజన సూచించారు. ఎ కొండూరు పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు శనివారం జిల్లా కలెక్టర్ జి. సృజన, గిరిజన సంక్షేమ శాఖ అధికారి జె. సునీతతో కలిసి పునరుద్ధరణ నియామకపు పత్రాలను కలెక్టరేట్‌లోని ఆమె ఛాంబర్‌లో అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అత్యుత్తమ బోదనను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలలో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను కాంట్రాక్ట్ పద్దతిపై నియమించడం జరిగిందన్నారు. విద్యార్థులలో విద్యా ప్రమాణాలను మెరుగు పరిచి ఉత్తమ ఫలితాలను సాధించడం ద్వారా ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలన్నారు. ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుల బోదన పద్దతులను ప్రతిభాపాటవాలను పరిగణలోనికి తీసుకుని ఏడాది పాటు వారి నియామకాన్ని పొడిగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా విద్యా శాఖ అధికారి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారులను సభ్యులుగా నియమించి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కమిటీ ఉపాధ్యాయుల పని తీరును క్షుణ్ణంగా పరిశీలించి ప్రతిభగల ఎనిమిది మంది ఉపాధ్యాయుల నియామకాలను ఎ కొండూరు గిరిజన ఆశ్రయ పాఠశాలలో మరో ఏడాది పాటు పనిచేసేలా ఎంపిక చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న హిందీ స్కూల్ అసిస్టెంట్ యం. శరత్‌బాబు, ఫిజికల్ డైరెక్టర్ జి. బాబురావు, తెలుగు స్కూల్ అసిస్టెంట్ జి. అమలమ్మ, ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ యం. శిరీష, బయోలాజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ యం. చంద్రబాబు, ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ఎస్‌కె సైదా, సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ పి. పద్మజ, సెకండ్ గ్రేడ్ టీచర్ కె. రాజబాబుల సర్వీసును పొడిగిస్తూ మంజూరు పత్రాలను అందజేసినట్లు జిల్లా కలెక్టర్ జి. సృజన తెలిపారు.