మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుండి అందే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఇంచార్జ్ శ్రీదేవి అధికారులకు సూచించారు. సోమవారం డిఆర్ఓ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బందర్ ఆర్డీవో ఎం వాణితో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక— “మీకోసం కార్యక్రమం” నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
-పెనమలూరు మండలం కానూరుకు చెందిన అబ్దుల్ షాకిర తన భర్త ఇరిగేషన్ శాఖలో వాచ్మెన్ గా పనిచేస్తున్నారని, అయితే సరిగా ఉద్యోగ విధులకు హాజరు కాకపోవడం, కుటుంబం వద్ద ఉండకుండా వేరేచోట ఉండడం, కుటుంబ పోషణ కష్టంగా మారిందని, తన భర్త ఉద్యోగం తనకు ఇప్పించాలని కోరుతూ అర్జీ అందజేశారు.
-పామర్రు మండలం జమీ గొల్వేపల్లి గ్రామానికి చెందిన కొల్లి గోపాలకృష్ణ తమ ప్రాంతంలో కొమరవోలు డ్రైనేజీలో పూడిక తీత పనులు చేపట్టకపోవడంతో పొలాలు ముంపుకు గురవుతున్నాయని, సమస్య పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
-బందరు మండలం బుద్ధాల పాలెం గొల్లగూడెం కు చెందిన చలంకుర్తి పాండురంగారావు తన కుమార్తెకు పసుపు కుంకుమ కింద ఇచ్చిన 1.02 ఎకరాల భూమికి తన కుమార్తె పేరుతో పట్టాదార్ పాస్ పుస్తకం ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
– జిల్లాలో శివారు ప్రాంతాలకు సాగునీరు అందించాలని, పెట్టుబడి సాయం అందించాలని, కౌలు రైతులకు సి సి ఆర్ సి కార్డులు అందజేసి రుణాలు మంజూరు చేయాలని, రైతు సేవ కేంద్రాల ద్వారా ఎరువులు, పురుగు మందులు అందించాలని కోరుతూ రైతు సంఘం ప్రతినిధులు మీకోసం లో అర్జీ సమర్పించారు.
డిఆర్ఓ అధికారులతో మాట్లాడుతూ మీకోసంలో ప్రజల నుండి అందిన అర్జీలను గడువు దాటకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, అర్జీ దార్లకు నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చు అర్జీలపై దృష్టి సారించాలన్నారు. కోర్టు ధిక్కరణ కేసులలో కౌంటర్స్ ఫైల్ చేయాలని అన్నారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, సర్వే ఏడి మనీషా త్రిపాటి, ఆర్టీసీ డిఎం పెద్దిరాజులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.