-స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో ప్రణాళిక రూపొందించాలి..
-ప్రజల సామాజిక అవసరాలను దృష్టిలో పెట్టుకోండి..
-జిల్లా కలెక్టర్ డా. జి. సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు పూర్తి మౌళిక వసతులను కల్పించి గ్రామాలను అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు భవిష్యత్ అవసరాలు ప్రజల సామాజిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రామ సమగ్రాభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. గ్రామాల సమగ్రాభివృద్దికి చేపట్టవలసిన ప్రణాళికలపై బుధవారం జిల్లా కలెక్టర్ జి. సృజన కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్, ఆర్‌డబ్యుఎస్, డ్వామాలకు చెందిన ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేకంగా ప్రస్తావించి దిశ నిర్థేశం చేయడం జరిగిందన్నారు. గ్రామాలను అభివృద్ధి చేయడంలో అధికారుల ఆలోచన విధానంలో మార్పు రావాలన్నారు. ప్రజల ప్రస్తుత సామాజిక అవసరాలతో పాటు భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో గ్రామాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి రాబోయే మూడు సంవత్సరాలలో చేపట్టి పూర్తి చేయాల్సిన పనుల నివేధికను రూపొందించాలన్నారు. మౌళిక వసతులైన రహదారులు, డ్రైయిన్లు, వీధి దీపాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి దశల వారిగా కలర్ కోడ్‌లతో ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. ప్రస్తుతం చేపట్టి పూర్తి చేయాల్సిన పనులు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రాధాన్యత క్రమంలో ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. 2025 మార్చి నాటికి ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయిలను ఏర్పాటు చేసే లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. డ్రైయిన్ల నిర్మాణంలో శాస్త్రీయ దృక్పధాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. జాతీయ ఉపాధి హామి పథకం కింద ఈ ఏడాది ఇంకనూ 22 లక్షల పనిదినాల లక్ష్యం ఉందన్నారు. లక్ష్యాన్ని సాధించేందుకు నెలకు 3 లక్షల పని దినాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామి పనులలో కూలీలను పెద్ద ఎత్తున భాగస్వామ్యులను చేసి పని కోరిన ప్రతి ఒక్కరికి పని కల్పించాలని పనుల ప్రగతిని ప్రతి రోజు టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేస్తానన్నారు. ప్రతి మండలానికి కేటాయించే నిధులతో పాటు, డియంఎఫ్ నిధులను కూడా వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల సామాగ్రాభివృద్ధికి ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా సేవలందించి అభివృద్ధిలో అధికారులు భాగస్వామ్యులు కావాలని కలెక్టర్ జి. సృజన సూచించారు. సమావేశంలో డ్వామా పిడి జె. సునీత, పంచాయతీ రాజ్ ఎస్‌ఇ అక్కినేని వెంకటేశ్వరావు, ఆర్‌డబ్యుఎస్ ఎస్‌ఇ డివి రమణ, జిల్లా పంచాయతీ అధికారి ఎన్.వి.శివ ప్రసాద్ యాదవ్, డిఆర్‌డిఏ పిడి కె. శ్రీనివాసరావు, రూరల్ డెవలప్‌మెంట్, ఆర్‌డబ్యుఎస్, డ్వామా అధికారులు పాల్గొన్నారు.