-ఎంపి కేశినేని శివనాథ్, ఎంపి హరీష్ మాధూర్ కు కృతజ్ఞతలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్డీయే కూటమిలో తెలుగు దేశం పార్టీ వున్నా కూడా ముస్లిం సమాజానికి నష్టం కలిగించే, వక్ప్ బోర్డ్ ను బలహీన పరిచి నిర్వీర్యం చేసే వక్ఫ్ బిల్లు ను జె.పి.సి (పార్లమెంటరీ జాయింట్ కమిటీ) కు పంపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేశారని టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహ్మాద్ ఫతావుల్లాహ్ తెలిపారు. వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు-2024 లోని దాదాపు 44 సెక్షన్ల పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ..వాటిపై పార్లమెంట్ లో చర్చ జరగాలని కోరుతూ గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహ్మాద్ ఫతావుల్లాహ్ మాట్లాడుతూ ఇటువంటి ప్రమాదకరమైన బిల్లును అడ్డుకోవాలని పార్లమెంట్ లో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), అమలాపురం ఎంపి హరీష్ మాథూరు ను జమాతే ఇస్లామి సంస్థ పెద్దల బృందంతో కలిసి వక్ఫ్ బోర్డ్ బిల్లు అమల్లోకి వస్తే జరిగే నష్టాలను వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగిందన్నారు. ఆ ఇద్దరు ఎంపీలు తెలుగుదేశం పార్టీ రీసెర్చ్ కమిటీ సభ్యులతో మాట్లాడి ఈ విషయాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు ఈ బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటీ కి పంపించాలని పార్లమెంట్ లో మాట్లాడిన టిడిపి పార్లమెంట్ సభ్యులకి కి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో పార్లమెంట్ లో జగన్ నాయకత్వంలో వైసిపి ఎంపిలు 22 మంది ఎన్.ఆర్.సి కి పూర్తి గా మద్దతు తెలిపారు. వక్ఫ్ బిల్లు విషయంలో మాత్రం జగన్ మోహన్ రెడ్డి మొసలి కన్నీరు కార్చుతున్నాడని ఎద్దేవా చేశారు. ఎన్.డి.ఎ కూటమిలో తెలుగుదేశం పార్టీ వున్నా కూడా వక్ఫ్ బిల్లు పై జె.పి.సి (పార్లమెంటరీ జాయింట్ కమిటీ) కు పంపించిన ఘనత టిడిపి సొంతమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లిం సమాజానికి ఎప్పుడు అండగా వుంటారని, అన్యాయం జరుగుతుంటే సహించరని తెలిపారు.
అమల్లోకి వస్తే వక్ఫ్ బోర్డ్ నిర్వీర్యం
భారతదేశంలో అత్యధిక ఆస్తులు కలిగిన మూడు సంస్థల్లో వక్ఫ్ బోర్డు ఒకటన్నారు. ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలోనైనా సవరణ చేస్తే అది ఆ సంస్థకు బలం చేకూరే విధంగా ఉండాలే తప్ప బలహీనపరిచే విధంగా ఉండకూడదన్నారు. వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు అమల్లోకి వస్తే భారతదేశపు వక్ఫ్ ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని, వక్ఫ్ బోర్డు నిర్వీర్యంగా మారుతుందన్నారు. అదే విధంగా వక్ఫ్ బోర్డ్ ఆస్తుల గురించి సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే వక్ఫ్ సర్వే కమీషన్ ను రద్దు చేసి ఆ అధికారాలు కలెక్టర్లకు అప్పచెప్పటం జరుగుతుందన్నారు. కలెక్టర్లకు ఆ అధికారం అప్పగిస్తే నిష్పక్షపాతంగా సర్వే జరగదని వక్ఫ్ ఆస్తులపై కలెక్టర్ రాజ్ అవుతుందని..అందుకే ఆ సెక్షన్ ను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. వక్ఫ్ సర్వే కమీషన్ కొనసాగించాల్సిందిగా డిమాండ్ చేశారు. గతంలో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ లో ఇద్దరు ముస్లిం లోక్ సభ సభ్యులు, రాజ్య సభ సభ్యులు గానీ వుండేవారు. ఇప్పుడు ఇద్దరు మహిళలను సభ్యులుగా పెట్టడం పై అభ్యంతరం లేకపోయినా ..ఆ మహిళలు ముస్లిమ్స్ అయి వుండాలని కోరారు. అదే విదంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు కమిటీ సభ్యుల్లో కూడా ఇద్దరు ముస్లిమేతర సభ్యులు ఉండాలని ఒక సెక్షన్ పెట్టడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
స్టేట్ వక్ఫ్ బోర్డు సీఈవో కి డిప్యూటీ సెక్రటరీ లెవెల్ ఉండాలి..ఆ అధికారి ముస్లిం అయి ఉండాలి. కానీ కొత్త సవరణ చట్టంలో ఈ పదవికి సంబంధించి ముస్లిం అనే పదాన్ని ఎత్తివేయడం జరిగింది. ఈ సెక్షన్ పై అభ్యంతరం తెలిపారు. రాష్ట్రాల వక్ఫ్ బోర్డ్ కమిటీ లకు వక్ఫ్ ఆస్తుల యాజమాన్య హక్కు నిర్ణయించే అధికారాన్ని కూడా తీసివేయటాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా వక్ఫ్ బోర్డుపై రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాలను కూడా తొలగించడం జరిగిందని చెప్పారు. భారతదేశ చరిత్రలో వక్ఫ్ బోర్డు ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు గానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తిని గాని, తమ ఆస్తిగా ప్రకటించిన దాఖలాలు ఎక్కడ కూడా లేవని, కానీ వక్ఫ్ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసిన కేసులు వేల సంఖ్యలో ఉన్నాయని తెలిపారు. అలాగే కొన్నిచోట్ల ప్రభుత్వాలు కూడా వక్ఫ్ బోర్డ్ స్థలాలను తమ సొంత స్థలంగా ప్రకటించుకున్న దాఖలాలు ఉన్నాయన్నారు.
మత పెద్దలతో చర్చ జరపాలి
ఈ ఇలాంటి పరిస్థితుల్లో వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టాన్ని మరింత బలం చేకూరే విధంగా సవరణలు చేయాలే తప్ప బలహీనపరిచే విధంగా వుండకూడదని భావిస్తున్నట్లు ప్రకటించారు. వక్ఫ్ సవరణ బిల్లు పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముస్లిం మేధావులతో, ముస్లిం జాతీయ అతిపెద్ద సంస్థలైన ముస్లిం పర్సనల్ లా బోర్డు, జమాతే ఇస్లామి హింద్, అలాగే తబ్లీగి జమాత్ , అహ్లె హదీస్, దేవ్ బంద్ సంస్థ, బరేల్వి సంస్థల సలహాలు సూచనలు కూడా తీసుకోవాలని మహ్మాద్ ఫతావుల్లాహ్ డిమాండ్ చేశారు.
ఈ మీడియా సమావేశంలో మౌలానా అబ్దుల్ సత్తార్, మౌలానా నసీమ్ అహ్మాద్, మౌలానా అమీరుల్ హఖ్, ఎమ్.డి.నూరుద్దీన్, షేక్ ఆషా, అబ్దుల్ కరీమ్, ఎమ్.డి ఇర్ఫాన్, మహ్మాద్ జాహేద్, తమీమ్ అన్సార్, బడేషా, ఫిరోజ్, రియాజ్, సలార్, వాజీద్ ఖాన్, గౌస్ తదితర నాయకులు పాల్గొన్నారు.