ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల జాబితా సవరణ తయారీలో భాగంగా బీఎల్వోల ద్వారా ఇంటింటి ఓటర్ జాబితా సర్వే నిర్వహించాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం అమరావతి నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఈఆర్ఓలతో మంగళవారం సీఈవో వివేక్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్ నుండి కలెక్టర్ డా.జి. సృజన, డిఆర్వో వి. శ్రీనివాసరావు, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ ఎం. దుర్గాప్రసాద్ హాజరయ్యారు.
వీడియో కాన్ఫరెన్స్ లో వివేక్ యాదవ్ మాట్లాడుతూ 2025, జనవరి 1 అర్హత తేదీతో చేపట్టే ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా రూపొందించేందుకు ఆగస్టు 20 నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు బీఎల్వోలు ఇంటింటి ఓటర్ల సర్వే ప్రక్రియ నిర్వహించాలన్నారు. అక్టోబర్ 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన జరుగుతుందన్నారు. అక్టోబర్ 29వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా రూపొందించాలన్నారు. సెప్టెంబర్ 29 నుంచి నవంబర్ 28వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. అనంతరం ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. డిసెంబర్ 24వ తేదీలోగా అభ్యంతరాలపై వచ్చిన దరఖాస్తుల పరిశీలన, పరిష్కార కార్యక్రమం చేపట్టాలన్నారు. ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా 2025, జనవరి ఆరో తేదీన ప్రత్యేక సంక్షిప్త సవరణ తుది ఓటర్ల జాబితా ప్రచురించేందుకు చర్యలు తీసుకోవాలని సీఈవో వివేక్ యాదవ్ ఆదేశించారు. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గానికి సంబంధించి ఈ ఏడాది నవంబర్ 23న ముసాయిదా ఓటర్ల జాబితాను, డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితా ప్రచురించాల్సి ఉన్నందున ఇందుకు సంబంధించిన కార్యకలాపాల షెడ్యూల్ పైనా మార్గనిర్దేశనం చేశారు.