-వాడవాడలా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు నిర్వహించాలి
-స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో స్వాతంత్ర్య సమరయోధులను సత్కరించండి
-జిల్లాల్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి
-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ప్రతి ఇంటిపై మువ్వన్నెల జాతీయ పతాకను ఎగురవేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పిలుపు నిచ్చారు.హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంపై బుధవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన జిల్లా కలక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించి కార్యక్రమం విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు.ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.అదే విధంగా ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు,జాతీయ జెండా ప్రాముఖ్యతను ప్రజలందరికీ తెలియజేసి వారిలో చైతన్యాన్ని కలిగించేందుకు ఊరూ వాడా హర్ ఘర్ తిరంగా ర్యాలీలను నిర్వహించుటలో జిల్లా కలక్టర్లు కీలక భూమిక పోషించాలని సిఎస్ ఆదేశించారు. 15వ తేదీన జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో స్వాతంత్ర్య సమరయోధులను సత్కరించాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలక్టర్లను ఆదేశించారు.అలాగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోను,ఎట్ హోం కార్యక్రమంలోను ప్రజల్లో దేశభక్తి భావాలను పొందించే రీతిలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు.అదే విధంగా జాతీయ జెండాతో ఉన్న సెల్ఫీ పొటోలను,వీడియోలను గ్రామ,వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా https://hargartiranga.comలో అప్ లోడ్ చేయాలని చెప్పారు. అనంతంరం హర్ ఘర్ తిరంగా కాన్వాస్ పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంతకం చేశారు.ఈవీడియో సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి వినయ్ చంద్,వివిధ జిల్లాల కలక్టర్లు తదితరులు పాల్గొన్నారు.