విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ ప్రజలకు ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ ఆసోసియేషన్ అధ్యక్షులు మోటూరి శంకరరావు 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం తమ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బ్రిటీష్ దాస్య శృంఖలాలను తెంచి, స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఈరోజు మనందరికీ పర్వదినమన్నారు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్ళతో పెకళించి వేసేందుకు ఆనాడు ఎందరో త్యాగమూర్తులు తమ ప్రాణాలను అర్పించారని గుర్తుచేశారు. “స్వరాజ్యమే నా జన్మహక్కు” అని ప్రకటించిన బాలగంగాధర తిలక్, లాలాలజపతిరాయ్, బిపిన్‌చంద్రపాల్, గోపాలకృష్ణ గోఖలే వంటి మహనీయులు సామాన్య ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఉద్యమాన్ని నడిపించారన్నారు. ఈ 78 ఏళ్ల కాలంలో దేశం ఎంతో పురోగతి సాధించిందని.. ఇంకా సాధించాల్సింది చాలా ఉందని చెప్పుకొచ్చారు. కొన్ని తరాల నిస్వార్థ త్యాగానికి నిదర్శనం మన స్వాతంత్ర పోరాటమని.. జాతీయ జెండాను ఎగురవేయడమంటే స్వేచ్చను అనుభవించడమేనని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య దినోత్సవం అనేది కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా జరుపుకునే పండుగ అని పేర్కొన్నారు. బ్రిటీష్ నిరంకుశత్వ పాలనకు ప్రతిఘటించి వారిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన వారిలో ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు ముందు వరుసలో నిలిచారని తెలిపారు. జాతికే కేతనం ఇచ్చిన పింగళి వెంకయ్య, అయ్యదేవర నాగేశ్వరరావు, కాశీనాథుని నాగేశ్వరరావు.. ఇలా ఎందరో మహనీయులు స్వాతంత్ర్యోద్యమానికి ఊపిరి పోసి, దేశ దాస్య శృంఖలాలను తెంచడంలో ముఖ్యభూమిక పోషించారన్నారు. ఆ స్వాతంత్ర్య సమరయోధుల ఉద్యమ స్ఫూర్తితో దేశ ప్రగతికి ప్రజలందరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. వారి ఆశయాలు, ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్లడమే.. ఆ మహనీయులకు మనం అర్పించే నిజమైన నివాళి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆసోసియేషన్ సభ్యులు, మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …