-బాపు మ్యూజియం లో పంద్రాగష్టు వేడుకలు
-జాతీయ పతాకం ఎగరవేసిన ఎంపి
-పింగళి వెంకయ్య, గాంధీ విగ్రహాలకు నివాళి
-ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కమిషనర్ సమక్షంలో మ్యూజియం సందర్శన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత దేశానికి స్వాతంత్య్ర వచ్చిన నాటి నుంచి దేశ ప్రజలందరూ గర్వపడేలా జాతీయ పతాకాన్ని రూపశిల్పి పింగళి వెంకయ్య ఉమ్మడి కృష్ణ జిల్లా వాసి కావటం తెలుగువారందరికీ గర్వకారణం. పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకం భారతదేశానికి ఒక ప్రతీకగా నిలిచిందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. బందరు రోడ్డ్ లోని బాపు మ్యూజియంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ముఖ్యఅతిధిగా ఎంపి కేశినేని శివనాథ్ హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు. ఎంపి కేశినేని శివనాథ్ కి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కమిషనర్ డాక్టర్ వాణి మోహన్ ఐ.ఎ.ఎస్. ఘన స్వాగతం పలికారు.
బాపు మ్యూజియం సిబ్బందితో కలిసి విక్టోరియా బ్లాక్ లోని జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, మహాత్మ గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. జాతీయ జెండా ఎగరవేసి స్వాతంత్య్రం కోసం కృషి చేసిన త్యాగధనుల పోరాటాన్ని కొనియాడారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కమిషనర్ డాక్టర్ వాణి మోహన్ అభ్యర్ధన మేరకు బాపు మ్యూజియం సందర్శించారు. బాపు మ్యూజియంలోని పురాతన వస్తువుల గురించి, కళాకృతుల గురించి ఎంపి కేశినేని శివనాథ్ కి సవివరంగా వివరించారు.
ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రకి సంబంధించిన వస్తువులను ఇంత భద్రంగా సంరక్షిస్తున్న ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ సిబ్బందిని అభినందించారు. బాపు మ్యూజియంకు మరింత ప్రాచుర్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. మ్యూజియం అభివృద్ది విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. నేటి యువతరం బాపు మ్యూజియం సందర్శించి స్వాతంత్య్రోద్యమ స్పూర్తి అందుకోవటమే కాకుండా, దేశ చరిత్రను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం బాపు మ్యూజియం రిజిస్టర్ లో ఎంపి కేశినేని శివనాథ్ సంతకం చేసి, తన అభిప్రాయాన్ని వ్యక్తపర్చారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ పి సురేష్, డిప్యూటీ డైరెక్టర్ ఓ. రామసుబ్బారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ పి మైకేల్, బాపు మ్యూజియం అసిస్టెంట్ డైరెక్టర్ కె నరసింహనాయుడు, అసిస్టెంట్ డైరెక్టర్ స్వామి నాయక్, టెక్నికల్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్రావు, టిడిపి నాయకులు ఎం ఎస్ బేగ్, మాదిగాని గురునాథం తదితరులు పాల్గొన్నారు.