-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, అధికారులకు ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు నిరంతరం రాజీవ్ గాంధీ పార్క్ నిర్వహణ సక్రమంగా జరుగుతూ ఉండాలని, మరింత సుందరంగా మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర సోమవారం రాజీవ్ గాంధీ పార్క్ పర్యటించి పరిశీలించారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని ఎటువంటి సమస్య లేకుండా చూసుకోవాలని అన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ ద్వారా నిర్వహిస్తున్న రాజీవ్ గాంధీ పార్క్ నిర్వహణ పరిశీలించారు. తన పరిశీలనలో ఫౌంటైన్లు పనిచేయకపోవడం గమనించి, ఇంజనీరింగ్ సిబ్బంది వెంటనే ఫౌంటెన్ ని మరమతులు చేయాలని ఆదేశించారు. మరుగుదొడ్లను సత్వరమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలు ఇచ్చారు. శని ఆదివారాల్లో ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఎంట్రెన్స్ గేట్ వద్ద ఈపాస్ మెషిన్ పెట్టి ప్రజలకు సౌకర్యవంతమైన ప్రవేశాన్ని కల్పించాలని అధికారులను ఆదేశించారు. రాజీవ్ గాంధీ పార్క్ ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలతో అధికారులు రావాలని ఆదేశించారు. ఈ పర్యటనలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతోపాటు ఎస్టేట్ ఆఫీసర్ టి. శ్రీనివాస్, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.