-జాతీయ చేనేత ప్రదర్శన వేదికగా కేక పుట్టించిన ర్యాంప్ వాక్
-నగర వాసుల నుండి మునుపెన్నడూ చూడని ఆదరణ: సవిత
-చేనేత కార్మికల ఆర్థికాభివృద్ధి కోసం కార్యాచరణ: సునీత
-విశిష్టమైన చేనేత కళపై ప్రజల్లో చైతన్యం: రేఖారాణి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ చేనేత ప్రదర్శన వేదికగా విజయవాడలో నిర్వహించిన హ్యాండ్లూమ్స్ ఫ్యాషన్ షో ఆహాతులను ఆకర్షించింది. విభిన్న రాష్ట్రాలకు చెందిన నూతన చేనేత వస్త్ర శ్రేణితో పడతులు చేసిన ర్యాంప్ వాక్ అదరహా అనిపించింది. చేనేత సంస్కృతి సంప్రదాయాలతో విజయవాడ మేరీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న జాతీయ చేనేత ప్రదర్శన నగర వాసుల విశేష ఆదరణను పొందింది. ముగింపు వేడుకలను పురస్కరించుకుని మంగళవారం చేనేత జౌళి శాఖ నిర్వహించిన ఫ్యాషన్ షో ఆహుతులకు కనువిందు చేసింది. సరికొత్త డిజైన్లతో రూపొందించిన సాంప్రదాయ చేనేత వస్త్రాలతో ప్రదర్శనలో అడుగులు వేసిన ముద్దుగుమ్మలు ఆహా అనిపించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన చీరాల ,ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి ఇలా ఒకటా రెండా వందలాది డిజైన్లతో ప్రత్యేకించి యువతను ఆకర్షించే విధంగా రూపుదిద్దిన చేనేత వస్త్రాల ప్యాషన్ షో కేక పుట్టించింది. దేశంలోని విభిన్న రాష్ట్రాలకు చెందిన చేనేత వస్త్రాలను ఫ్యాషన్ షో ద్వారా ప్రదర్శింప చేసారు. ఫలితంగా చేనేత వస్త్రాలను నేటి యువతీయువకులు చేరువ చేసే క్రమంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. మోడల్స్ తో పాటు చేనేత వస్త్రాలను అమితంగా ఇష్టపడే యువతులు సైతం స్వచ్ఛంధంగా ర్యాంప్ వాక్ లో పాల్గొనటం విశేషం. చేనేత వస్త్రాలంటే వయోజనులకే అన్న నానుడికి ముగింపు పలుకుతూ వేదికపై పడతుల నడక సాగింది. చేనేత ప్రేమికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన నూతన డిజైన్ల వస్త్ర శ్రేణి ఫలితంగా యువతుల అందం రెట్టింపు అయ్యిందంటే ఎటువంటి ఆశ్చర్యం లేదు. పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. జి.పద్మజా రెడ్డి కూచిపూడి నృత్య ప్రదర్శన సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ ఈ ప్రదర్శన నగర వాసుల నుండి మునుపెన్నడూ చూడని ఆదరణను చూరగొంటుందన్నారు. దాదాపు రూ. 2 కోట్ల విలువైన చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారన్నారు. చేనేత వస్త్రాలు అందంతో పాటు హుందాతనాన్ని ఇస్తాయని, ఆరోగ్యపరంగాను, పర్యావరణ పరంగాను ఎంతో అనుకూలమైనవన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత రంగం పట్ల ప్రత్యేక దృష్టి సారించి వారి ఆర్థికాభివృద్ధి కోసం కార్యాచరణ అమలు చేయనుందన్నారు. ఎల్లా వేళల పని కల్పించే లక్ష్యంతో గరిష్ట విక్రయాల కోసం పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రంలో చేనేతకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. గత కొన్నేళ్లలో నేతన్నలకు సరైన ఆదాయం లేక, వారి ఉత్పత్తులు కొనేవారు లేక వలసపోయే పరిస్థితి వచ్చిందని, ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా చూసామన్నారు. నేతన్నలను ప్రోత్సహించే క్రమంలో ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలని ఈ సందర్భంగా మంత్రి సవిత పిలుపునిచ్చారు.
చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు ఆలోచనల మేరకు చేనేత కళను ప్రోత్సహిస్తూ ఈ రంగాన్ని స్వయం సమృద్ది బాటలో నడిపించటానికి కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర చేనేత వస్ర్త శ్రేణికి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు లభించే విధంగా కాలానుగుణ ఫ్యాషన్లకు అనుగుణంగా నూతన వెరైటీలను అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. విశిష్టమైన చేనేత కళపై ప్రజల్లో చైతన్యం తెచ్చే క్రమంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చేనేత జౌళి శాఖ కమీషనర్ రేఖారాణి అన్నారు. ఆప్కో ఎండీ ఆర్.పవనమూర్తి మాట్లాడుతూ ఆప్కో నేతృత్వంలో పెద్ద ఎత్తున ప్రదర్శనలను ఏర్పాటు చేయటం ద్వారా విక్రయాలను ప్రోత్సహిస్తున్నామని, రాయితీ ధరలకే అమ్మకాలు చేస్తేన్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ అదనపు సంచాలకులు శ్రీకాంత్ ప్రభాకర్, సంయిక్త సంచాలకులు కన్నబాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.