-మహిళలు అభివృద్ధి చెందితే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది : ఎం.ఎల్.సి సిపాయి సుబ్రమణ్యం
-స్వయం సహాయక మహిళలందరూ ఆదాయ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి : పి.డి డి.ఆర్.డి.ఏ ప్రభావతి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా లోని స్వయం సహాయక సంఘంలోని మహిళలందరినీ లక్షాధికారులను చేయాలనేదే గౌ.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఉద్దేశమని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు మహారాష్ట్ర నుండి గౌ. భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోది లక్ పతి దీదీ కార్యక్రమం ప్రారంభించగా జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, పిడి డిఆర్డిఏ ప్రభావతి కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా లక్ పతి దీదీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం జరుగుతోందన్నారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘంలోని మహిళ లు పథకాన్ని ఉపయోగించుకుని లక్షాధికారులు కావాలని తెలిపారు. వెలుగు సంస్థ ప్రారంభమై ఇప్పటికి దాదాపు 24 సంవత్సరాలు అయిందని, ఈ సంస్థ ద్వారా స్వయం సహాయక సంఘo లోని మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘాలలోని ప్రతి మహిళ లక్షాధికారి కావాలని కోరుకుంటున్నాను అని మహిళ సాధికారత సాధించే దిశగా… ఆర్థిక అభివృద్ధి సాధించాలని తెలిపారు.
ఎమ్మెల్సీమాట్లాడుతూ.. మహిళల సామర్థ్యాన్ని గుర్తించి ఆర్థికంగా భరోసా కల్పించే దశగా.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని స్వయం సహాయక సంఘాల మహిళలు వాటిని సద్వినియోగం చేసుకో కలిగితే లక్షాధికారులు తప్పక అవుతారని తెలిపారు. రేషన్ కార్డ్, ఆరోగ్యశ్రీ, ఇళ్ళపట్టాలు తదితర పథకాలను కూడా మహిళల పేరు మీదనే ఉన్నాయని తెలిపారు. మహిళలు అభివృద్ధి చెందితే రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుందని కావున మహిళలందరూ లక్షాధికారులు కావాలని ఆశిస్తున్నానని అన్నారు.
డి ఆర్ డి ఎ పిడి మాట్లాడుతూ.. జిల్లాలోని స్వయం సహాయక సంఘాలలోని మహిళలు ఆదాయ వనరుల వైపు దృష్టి పెట్టాలని తెలిపారు. స్వయం సహాయక సంఘంలోనే మహిళల్లో ఎవరైతే సంవత్సరానికి లక్ష రూపాయల ఆదాయం దాటే మహిళలను గుర్తించడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి జిల్లాలో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా 101800 మందిని లక్షాధికారులు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. స్త్రీనిధి, ఉన్నతి, తదితర పథకాల కింద రుణాలు మహిళా సంఘాలకు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం సంవత్సరానికి లక్ష రూపాయల ఆదాయం దాటే మహిళా సంఘాలకు సర్టిఫికెట్స్ మరియు 7905 లక్ పతి దీదీ జీవనోపాధి కొరకు రూ. 98 కోట్ల 11 లక్షల రూపాయలు రుణాల పంపిణీ చెక్కును కలెక్టర్ గారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సమావేశంలో డిఆర్డిఏ పిడి ప్రభావతి, ఐ సి డి ఎస్ పి డి జయలక్ష్మి, డిఆర్డిఏ డి పి యమ్ మాధవి, స్వయం సహాయక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.