-గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ పనితీరును సమీక్షించిన మంత్రి
-స్వయం సహాయక సంఘాలను స్వయం ఉత్పత్తి కేంద్రాలుగా మార్చాలని అధికారులకు సూచించిన మంత్రి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
27 ఆగస్టు 2024: ప్రజల జీవన ప్రమాణాలు, జీవనోపాది అవకాశాల పేపుకోసం మెరుగైన ఫలితాలు సాధించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాందుల సాధికారత మరియు సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులు ఆదేశించారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ పనితీరును అధికారులతో మంత్రి మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలను స్వయం ఉత్పత్తి కేంద్రాలుగా మార్చే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. నూతన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత 100 రోజుల్లో సాధించాల్సిన ప్రగతి అందులో ఏమేరకు ఫలితాలు సాధించారు అనేదానిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖలో ప్రస్తుతం కొనసాగుతున్న పథకాల అమలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. తోంభై లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులలో యాభై ఐదు లక్షల మంది లక్ష కన్నా అదనపు ఆదాయం కలిగి ఉన్నారని, మిగిలిన ముప్పై ఐదు లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులను లక్ష కన్నా ఎక్కువ ఆదాయం సాధించేందుకు లక్పతి స్కీం కింద అభివృద్ధిలోకి తీసుకురావాలని ఆయన సూచించారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా ఇప్పుడు 144 రకాల ఉత్పత్తులను 98 గ్రూపుల వారు తయారు చేస్తున్నారని వారి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని మంత్రి సూచించారు. రాష్ట్రస్థాయిలో పది స్వయం సహాయక సంఘాలు తయారు చేసే ఉత్పత్తులను చిన్న మధ్య తరహా పరిశ్రమల స్థాయికి తీసుకెళ్లాలని, మరో వంద సహాయక సంఘాలు తయారు చేసే ఉత్పత్తులను సూక్ష్మ చిన్న పరిశ్రమల స్థాయిలోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, సెర్ప్ సీఈఓ వీర పాండ్యన్, పలువురు సెర్ప్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.