-తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి వి శేఖర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సార‌్వత‌్రిక విద‌్యతో ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చునని తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి వి శేఖర్ అన్నారు.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ తిరుచానూరులో తిరుపతి జిల్లా ఓపెన్ స్కూల్స్ అధ్యయన కేంద్రాల సమన‌్వయ కర‌్తలతో అడ‌్మిషన‌్ల ప‌్రక‌్రియపై శనివారం ఒక రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ దరఖాస్తులు ఆన్ లైన్ చేసే సందర్భంలో తరచుగా చోటు చేసుకుంటున్న తప‌్పిదాలను గురించి వివరించారు.ధరఖాస‌్తుతో పాటుగా జత చేయవలసిన దృవ పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలని తెలిపారు. తల‌్లితండ‌్రి పేర‌్లు, పుట్టిన తేదీ,కులము, మీడియం, సబ్ జెక‌్టుల ఎంపిక వంటి విషయాలు జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. ముందుగా అభ‌్యర‌్థి అక్షరాస‌్యతను పరిశీలించాలని సూచించారు.మీ ప‌్రాంతాలలో వుండే విద‌్యాశాఖాధికారులు, సచివాలయ సిబ్బంది, మహిళా సంఘాలు, ఉపాధి హామీ సిబ్బంది, కూలీలు,ఆటో డ్రైవర్లను కలిసి ఓపెన్ స్కూల్ ఉపయోగాలను వివరించాలన్నారు. ఓపెన్ స‌్కూల్ కూడా రెగ్యులర్ విద‌్యతో సమానమని తెలియజేయాలని చెప్పారు.అడ‌్మిషన‌్లను వేగవంతం చేయాలని తెలియజేశారు.గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎక్కువ అడ‌్మిషన‌్లు చేయటానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పుస‌్తకాలు,దృవ పత్రాలు పోస‌్టు ద‌్వారా పంపడం వలన ఎదుర‌్కుంటున‌్న సమష‌్యలను డీఈఓ దృష్టికి అధ‌్యయన కేంద్రాల సమన‌్వయ కర‌్తలు తీసుకుని వచ్చారు.ఈ విషయంపై ఉన‌్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల సహాయ సంచాలకులు మరియు జిల్లా సమన్వయకర్త గురుస్వామి రెడ్డి,జిల్లాలోని ఓపెన్ స్కూల్స్ అధ్యయన కేంద్రాల సమన్వయకర్తలు పాల్గొన్నారు.