-సంక్షేమ వసతి గృహం, ఈ పంట నమోదు పై ఆదేశాలు
కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులకు ప్రభుత్వపరంగా మేలు చేకూర్చే విధంగా కోరుకొండ గ్రామంలోని 707 ఎకరాల రెవిన్యూ ఖాతా గా ఉన్న సాగు విస్తీర్ణం భూమిని రైతుల వివరాలు ఆధారంగా ఈ పంట నమోదుకు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు ఆదేశించారు. ఆదివారం కోరుకొండ మండలం లో కోరుకొండ, కాపవరం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా జెసి చిన్న రాముడు మాట్లాడుతూ, శిథిలావస్థకు, నివాస యోగ్యంగా లేని సంక్షేమ వసతి గృహాలలో ఉన్న విద్యార్థులను సురక్షిత భవనంలోకి తక్షణం తరలింపు చెయ్యాల్సి ఉంటుందనీ ఆదేశించారు. కాపవరం ఎస్సి బాలికల వసతి గృహం స్లాబ్ శిథిలావస్థకు చేరి ఉండడాన్ని క్షేత్ర స్థాయిలో ప్రత్యక్షంగా జెసి అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు, మండల ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి అటువంటి భవనాలు గుర్తించి, ప్రత్యామ్నాయ మార్గాలను సూచించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే కలెక్టర్ వారి ఆదేశాల మేరకు 26 మంది బాలికలను సురక్షిత భవనంలోకి తరలించినట్లు అధికారులు తెలియ చేశారు.
ఖరీఫ్ సీజన్లో సాగు వివరాలు ఈ పంట నమోదుకు సెప్టెంబరు 15 వరకూ మాత్రమే సమయం ఉందని జెసి ఎస్ చిన్న రాముడు తెలియ చేశారు. ఈలోగా కోరుకొండ గ్రామంలో రెవెన్యు ఖాతా గా ఉన్న 707 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సాగు భూమి ని రైతుల వివరాల జాబితా మేరకు “ఈ పంట ” గా నమోదు కు రెవిన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలనీ పేర్కొన్నారు. అనంతరం తిరుగు ప్రయాణంలో వెస్టు గొనగూడెం వద్ద రహదారి మార్గంలో భారీ వర్షాల కారణంగా ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వర్షపు నీరు సక్రమంగా ప్రవహించే విధంగా చర్యలు తీసుకోవాలనీ అధికారులకి సూచనలు ఇవ్వడం జరిగింది. జాయింట్ కలెక్టర్ వెంటా జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు తాసిల్దార్ వి సుస్వాగతం వ్యవసాయ శాఖ ఏడి మల్లికార్జునరావు తదితరులు ఉన్నారు.