-ఒక్కో లంక గ్రామానికి ఒక్కొక్క బృందాన్ని ఏర్పాటు చేశాం
-జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వరద ఉధృతిని ఎదుర్కోవడానికి అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతున్న కారణంగా కృష్ణా జిల్లాలో నది వెంబడి గ్రామాల, లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అన్ని చర్యలు చేపట్టామన్నారు. జిల్లా కలెక్టర్ ఆదివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాలు, కృష్ణానదికి వరద ఉధృతి, తీసుకోవలసిన చర్యలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాల తరలించడానికి ప్రతి లంక గ్రామానికి ఒక్కొక్క బృందాన్ని, లంక గ్రామాలు ఎక్కువగా ఉన్న మండలానికి జిల్లా అధికారిని నియమించామన్నారు. అన్ని లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి జాయింట్ కలెక్టర్ గారిని ఓవరాల్ ఇన్చార్జిగా నియమించామన్నారు. అధికారులందరూ క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు లంక గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని, అధికారులకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. గతంలో ఎంత వరద వచ్చినా ఏమీ జరగలేదని ప్రజలు అపోహ పడవద్దని, అన్ని ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. ఒక్క ప్రాణనష్టంగాని జరగకూడదని, ఒక్క పశువు కోల్పోకూడదని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు.
లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. లంక గ్రామాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అవసరమైన బోట్లు సిద్ధం చేయాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించామన్నారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను అవనిగడ్డ, తోట్లవల్లూరు పంపినట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 11 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని ఇవి ఇంకా పెరగవచ్చు అన్నారు.
కృష్ణానది వరద పెరిగే అవకాశం
కృష్ణా నదికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని, నది తీరం వెంబడి గ్రామాలు లంక గ్రామాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలలో పునరావాస కేంద్రాలకు తరలించాలని, వారికి ఆహారం మంచినీరు అందించాలని ఆదేశించారు. నది గట్లపై పహార ఉంచాలని, నది గట్లు బలహీనంగా ఉన్న చోట్లు గుర్తించి పటిష్ట పరచాలని, ముందుగా ఇసుక బస్తాలు, సరుగుడు బాదులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ శ్రీదేవి, జడ్పీ సీఈవో ఆనంద్ కుమార్, డీఎస్ఓ వి పార్వతి, సిపిఓ జి గణేష్ కృష్ణ, జిల్లా పశుసంవర్ధక అధికారి శ్రీనివాసరావు ఆర్ అండ్ బి ఈఈ కె.శ్రీనివాసరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్ రావు, తదితరులు పాల్గొన్నారు.