-నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో డ్రైన్ల పై ఆక్రమణలు ఇష్టానుసారం చేస్తున్నారని ఫలితంగా ప్రస్తుత వర్షాలకు డ్రైన్లు బ్లాక్ అయి వర్షం నీరు ఇళ్లల్లోకి, లోతట్టు ప్రాంతాలకు చేరీ స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కల్గిస్తుందని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఆదివారం జిటి రోడ్, శ్రీనివాసరావు తోట, పాత గుంటూరు, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, డ్రైన్ల ఆక్రమణల పై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే తొలగించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో డ్రైన్ల పై ఆక్రమణలను పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు సమన్వయంతో తొలగించాలన్నారు. ఆక్రమణల వలన డ్రైన్లు బ్లాక్ అయి వర్షం నీరు రోడ్ల మీదకు, ఇళ్లల్లోకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ప్రధాన డ్రైన్లను కూడా వివిధ వ్యాపారాల పేరుతొ ఆక్రమణ చేసుకొని, వ్యాపార వ్యర్ధాలు డ్రైన్లలో వేస్తుంటే అధికారులు ఏమి చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాటికి ఆక్రమణలు తొలగించాలని లేకుంటే సంబందిత అధికారులు, సచివాలయ కార్యదర్శులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు కూడా తమ వ్యాపార సముదాయాలను తప్పనిసరిగా డ్రైన్ కి వెనుక వైపు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని, ఇక నుండి డ్రైన్ల మీద, డ్రైన్ కి ముందుకు వచ్చి ఏర్పాటు చేసుకుంటే వెంటనే తొలగించడం జరుగుతుందన్నారు.
అనంతరం లాల్ పురం రోడ్ లోని ఓ పెట్రోల్ బంక్ లో మీటర్ ఏర్పాటు చేయడానికి ముందే ట్యాప్ కనెక్షన్ చేసి ఉండడం గమనించి, సంబందిత ఇంజినీరింగ్ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షనం ట్యాప్ కనెక్షన్ ని తొలగించాలని, నిబందనల మేరకు విధులు నిర్వహించకుండా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పర్యటనలో ఎస్.ఈ. శ్యాం సుందర్, ఎంహెచ్ఓ మధుసూదన్, ఈఈ సుందర్రామిరెడ్డి, కోటేశ్వరరావు, డిఈఈలు రమేష్ బాబు, శ్రీధర్, డిసిపి శ్రీనివాస్, ఎస్.ఎస్. ఆయుబ్ ఖాన్, టిపిఎస్ లు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.