-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్ణ ఆంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ప్రణాళికలను మార్గదర్శకాల మేరకు ప్రతి శాఖ జాగ్రత్తగా చిత్తశుద్ధితో ఆచరణాత్మకంగా జాగ్రత్తగా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు స్వర్ణ ఆంధ్ర @ 2047 ప్రణాళిక రూపొందించడంపై అమరావతి నుండి సంబంధిత కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లకు, హెచ్ ఓ డి లకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వర్చువల్ విధానంలో సమీక్షించి దిశా నిర్దేశం చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి నారపు రెడ్డి మౌర్య, డి ఆర్ ఓ పెంచల కిషోర్ సంబంధిత జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా విసి నందు సిఎస్ కు కలెక్టర్ వివరిస్తూ తిరుపతి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరుమల, శ్రీకాళహస్తి, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని ప్రతి రోజూ సుమారు 75 వేల పైచిలుకు మంది తిరుమల, శ్రీకాళహస్తి లో 50 వేల మంది పర్యాటకులు జిల్లాను సందర్శిస్తుంటారని, జిల్లాలో ప్రముఖ స్టార్ హోటల్ లు ఉన్నాయని పర్యాటకులను కనీసం 2 నుండి మూడు రోజులు ఉండేలా వారు జిల్లాలోని పర్యాటక, పుణ్యక్షేత్రాలను, ఫారెస్ట్, బీచ్ లు సందర్శించేలా ఆకర్షించగలిగితే స్థానికంగా యువతకు ఉపాధి, రెవెన్యూ ఉత్పాదన ఉంటుందని ఆ దిశలో పర్యాటక శాఖ తదితర సంబంధిత శాఖల ద్వారా మైస్ టూరిజం ప్రమోషన్ చేయనున్నామని తెలిపారు. తిరుపతి జిల్లా పరిశ్రమలకు అన్ని విధాలా అనుకూలమైనదని, పలు పారిశ్రామిక వాడలు శ్రీసిటీ, సీబీఐసి, విసిఐసి ఉన్నాయని తెలుపుతూ వాటిపై ఎక్కువగా దృష్టి పెట్టి గ్రోత్ రేట్ పెరిగేలా ప్రణాలికలు రూపొందించనున్నామని తెలిపారు. మైస్ టూరిజం, పరిశ్రమల స్థాపన అంశాలు జిల్లాలో గ్రోత్ ఇంజిన్ లు అని తెలిపారు.
విసి అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణ ఆంధ్ర @2047 సాధన కొరకు మునిసిపాలిటీ, మండల, జిల్లా స్థాయి ప్రణాళికలు తయారు కావాలని అందుకొరకు 100 రోజులు, వార్షిక, ఐదేళ్ళ ప్రణాళికలతో ప్రతి శాఖ నివేదిక రూపొందించాలని పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ, పర్యాటక, పరిశ్రమల, విద్యా వైద్య తదితర శాఖలు స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్య సాధన పై దృష్టి పెట్టాలని తెలిపారు.
వికసిత భారత్ 2047 నేపధ్యంలో రాష్ట్రంలో స్వర్ణ ఆంధ్రా @2047 లక్ష్య సాధన కోసం మండల స్థాయి ప్రణాళికలు సెప్టెంబరు 30 తేదీ నాటికి అందజేయాల్సి ఉంటుందన్నారు. అదే క్రమంలో జిల్లా స్థాయి లో సమీకృతం చేసి జిల్లా విజన్ డాక్యుమెంట్ నివేదిక అక్టోబర్ 15 లోగా అందజేయాల్సి ఉంటుందన్నారు. స్వర్ణ ఆంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ పర్యవేక్షణ మరియు అమలు విధానంలో ఐదేళ్ళ దీర్ఘకాలిక వ్యూహం అమలు చేసేందుకు చొరవ చూపాలని ఆదేశించారు. నీతి ఆయోగ్ ఆమోదం, గౌ. ముఖ్యమంత్రి గారి సూచనలు, సలహాలతో తుది రూపం దిద్దుకున్న స్వర్ణ ఆంధ్ర @ 2047 డాక్యుమెంట్ మేరకు రాష్ట్ర స్థాయిలో నవంబర్ ఒకటవ తేదీన ప్రారంభం కానున్నట్లు తెలిపారు. సదరు రూపొందించే జిల్లా యొక్క విజన్ డాక్యుమెంట్ ను ప్రజలలోకి తీసుకువెళ్లాలన్నారు. ప్రణాళికలో ప్రజల సూచనలు, సలహాలను స్వీకరించాలన్నారు. ప్రజా సంబంధమైన వార్షిక ప్రణాళిక ఉండాలని, ప్రజలు భాగస్వాములయ్యేందుకు క్యూ ఆర్ కోడ్ అందుబాటులోకి తెస్తామన్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, ప్రభుత్వ కార్యాలయాలు, తదితర ముఖ్య సెంటర్లలో క్యూ ఆర్ కోడ్ ఉంచుతామన్నారు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయగానే ప్రజల అభిప్రాయాలను పొందుపరచవచ్చన్నారు.
ఆ క్రమంలో రానున్న ఐదేళ్ళ కాలంలో 2024-25 నుండి 2028-29 వరకూ అమలు చేయుచున్న కార్యక్రమాల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. జిల్లాలోని ప్రతీ ఒక్క డిపార్ట్మెంట్ వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో, పరిశ్రమలు, మానవ వనరులు, వైద్య విధానం, నైపుణ్య అభివృద్ధి లక్ష్యాల సాధన, తదితర అంశాల్లో ఆచరణ సాధ్యం అయ్యే విధంగా ప్రతిపాదనలు అందజేయాల్సి ఉంటుందన్నారు.
సదరు విజన్ డాక్యుమెంట్ తయారీకి సిపిఓ కో ఆర్డినేషన్ అధికారిగా ఉంటారని తెలిపారు. మండల, మునిసిపల్ విజన్ డాక్యుమెంట్ తయారితో, సంబంధిత శాఖల జిల్లా అధికారులు వారి శాఖకు సంబందించిన విజన్ డాక్యుమెంట్ ను మార్గదర్శకాల మేరకు ఆచరణాత్మకంగా తయారు చేయాలని సూచించారు. సిపిఓ కు అందే ప్రచార సామగ్రిని మండల మునిసిపల్ అధికారులు సూచించిన తేదీల్లో తీసుకెళ్ళి వారి ప్రాంతాల్లో ప్రదర్శించాలని అన్నారు. జిల్లా గ్రోత్ రేట్ ను విజన్ డాక్యుమెంట్ నందు పొందుపరచాల్సి ఉంటుందని తెలిపారు. సదరు విజన్ డాక్యుమెంట్ తయారు పర్యవేక్షణ కోర్ కమిటీ సిపిఓ, మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్, డిఆర్ఓ ఉంటారని, అలాగే సంబంధిత సెక్టార్ శాఖలకు నోడల్ అధికారులను నియమించడం జరిగిందని, అందులో వ్యవసాయ మరియు వ్యవసాయేతర అంశాలకు జిల్లా అగ్రికల్చర్ అధికారి, పరిశ్రమలకు సంబంధించి జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, నిర్మాణ రంగం సంబంధించి జిల్లా ఆర్ అండ్ బి అధికారి, ఆరోగ్య సర్వీస్ సెక్టార్ కు డిఎంహెచ్ఓ, విద్యా సంబంధిత అంశాలకు జిల్లా విద్యాశాఖ అధికారి, సంక్షేమ శాఖలకు సంబంధించి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి, కార్పొరేషన్లు ఇతర శాఖలు పిడి డిఆర్డిఎ, పంచాయితీలకు జిల్లా పంచాయితీ అధికారిణి బాధ్యులుగా ఉంటారని తెలిపారు.
ఈ ప్రతిష్ఠాత్మకమైన ఈ విజన్ డాక్యుమెంట్ తయారీ ఎంతో బాధ్యతగా చేపట్టి పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.