-ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలోని పట్టభద్రులైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందరూ సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 6వ తేదీ వరకు ఓటర్ నమోదు చేసుకోవాలి
-గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేవారికి సచివాలయ ఉద్యోగులు అండగా నిలుస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు :ఎం.డి.జాని పాషా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా మాట్లాడుతూ, రానున్న 2025వ సంవత్సరంలో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ మరియు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి స్థానాలకు జరగనున్న ఎన్నికలకు సెప్టెంబర్ 30వ తేదీ నుండి నవంబర్ 6వ తేది వరకు ఫారం 18ద్వారా ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ లో ప్రతి గ్రామ వార్డు సచివాలయ పట్టభద్రులైన ఉద్యోగులు ఓటర్ గా నమోదు కొఱకు, ఫార్మ్ 18తో డిగ్రీ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ, ఆధార్ జిరాక్స్ కాపీ, ఓటర్ కార్డు జిరాక్స్ కాపీ, పాస్ పోర్ట్ ఫోటో మరియు ఫోన్ నెంబర్ జతపరచి ఓటర్ గా నమోదు చేసుకోవాలని తెలిపారు.
ప్రజాస్వామ్యంలో ఓటు బలమైన ఆయుధం, నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలోని రెండు శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశిస్తాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఉద్యోగులనుండి సేకరించిన సమాచారం మేరకు,రెండు శాసనమండలి స్థానాలలో దాదాపుగా లక్షన్నర ఓట్లు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులవి ఉంటాయని ప్రాధమికంగా తెలియవచ్చిందని ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఓటరు గా నమోదు చేసుకొని ఓటు హక్కు ను వినియోగించుకోవాలని పిలుపునిస్తున్నట్లు ఎం.డి.జాని పాషా తెలిపారు.
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే వారికి మాత్రమే ఉద్యోగులు అండగా నిలుస్తారని తెలిపారు.ముఖ్యంగా అపరిష్కృతంగా ఉన్న సచివాలయ ఉద్యోగుల పే స్కేల్ మార్పు,పదోన్నతులు,వివిధ ప్రభుత్వశాఖల్లో విలీనం,జాబ్ చార్ట్ ప్రకారం మాత్రమే విధులు అప్పగించేలా చేయడం,క్షేత్ర స్థాయిలో అల్పస్థితి విధుల నుండి ఉద్యోగులు విముక్తి కల్పించాలని,సాధారణ బదిలీలు కోరుకుంటున్న అంశాల పరిష్కారం కోసం కృషి చేసే వారికి,న్యాయబద్ధంగా ఉద్యోగుల వాణిని చట్ట సభలలో వినిపించే వారికి గ్రామ వార్డు సచివాలయ పట్టభదృలైన ఉద్యోగులు అండగా నిలుస్తారని ఈ సందర్భంగా జాని పాషా తెలియజేశారు.
Prajavartha Online Telugu News