Breaking News

జిల్లా ఖనిజాల ఫౌండేషన్ నిధుల వినియోగం పై సమావేశం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో అసంపూర్తిగా నిలిచిపోయిన అంగన్వాడి, వసతి గృహాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,పాఠశాల భవనాల నిర్మాణానికి జిల్లా ఖనిజాల ఫౌండేషన్ నిధులను (డి ఎం ఎఫ్) తొలి ప్రాధాన్యతగా వినియోగించాలని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు.

సోమవారం సాయంత్రం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర మంత్రి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తో కలిసి జిల్లాలోని శాసనసభ్యులతో జిల్లా ఖనిజాల ఫౌండేషన్ నిధుల వినియోగం పై సమావేశం నిర్వహించారు.

తొలుత జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ జిల్లాలో జిల్లా ఖనిజాల ఫౌండేషన్ నిధులు 20 కోట్ల రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయని ఆ నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందనీ మంత్రికి వివరించారు.
ముఖ్యంగా 55 శాతం నిధులు తాగునీరు, మురుగునీరు వ్యవస్థ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గనులు సంబంధ వ్యాధుల చికిత్స కోసం, బీమా పథకాల కోసం, పాఠశాల భవనాలు,ప్రయోగశాలలు,గ్రంధాలయాలు, మరుగుదొడ్లు వసతి గృహాలు, నైపుణ్య కేంద్రాలు తదితర వసతుల ఏర్పాటు కోసం ఖర్చు చేయవచ్చన్నారు. అలాగే 40 శాతం నిధులను రహదారులు, వంతెనలు, సాగునీటి ప్రాజెక్టులు తదితర వసతుల కల్పనకు వినియోగించవచ్చన్నారు. మిగిలిన 5 శాతం నిధులను గనులు భూగర్భ శాఖ పరిపాలన ఖర్చులకు వినియోగించుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఉన్న 20 కోట్ల రూపాయలలో దాదాపు 8 కోట్ల రూపాయలను సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో మరమ్మతు పనులకు వినియోగించుటకు ప్రతిపాదించామని మంత్రికి వివరించారు. మరో 2 కోట్ల రూపాయలు ఆరోగ్య పరికరాల కొనుగోలుకు, 15 లక్షల రూపాయలను గిరిజన సంక్షేమ శాఖలో పనులకు,50 లక్షల రూపాయలను ఆక్వా ప్రయోగశాల నిర్మించడానికి వినియోగించదలిచామన్నారు. ఇంకా 11 కోట్ల రూపాయలు మిగిలి ఉంటుందని ఆ మొత్తాన్ని అన్ని నియోజకవర్గాలకు వివిధ అభివృద్ధి సంక్షేమ పనుల కోసం కేటాయించుటకు ప్రతిపాదించామన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీ స్టడీ సర్కిల్, అంబేద్కర్ భవన్ నిర్మాణానికి కొంత డిఎంఎఫ్ నిధులు కేటాయించాలని కలెక్టర్కు సూచించారు. ఎంపీడీవోలను పిలిపించి మండలాల వారీగా అసంపూర్తిగా నిలబడిపోయిన అంగన్వాడి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వసతి గృహాలు, తదితర భవనాల జాబితా సేకరించి వాటిని పూర్తి చేయుటకు నిధులను వినియోగించాలని సూచించారు. ఇందుకోసం శాసనసభ్యులు వారి పరిధిలో అవసరమైన భవనాల పూర్తికి ప్రతిపాదనలు పంపాలన్నారు. అద్దె భవనాల్లో నడుస్తున్న ప్రభుత్వ సంస్థలకు కూడా ప్రాధాన్యతనిచ్చి నిధులు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
మచిలీపట్నంలో మంచినీటి సౌకర్యానికి అవసరమైన ఫిల్టర్ బెడ్లు ఏర్పాటుకు కూడా నిధులు కేటాయించాలన్నారు.

ఈ సమావేశంలో పెనమలూరు,గన్నవరం, పామర్రు,పెడన నియోజకవర్గాల శాసనసభ్యులు బోడే ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణ ప్రసాద్, పంచాయతీరాజ్ ఎస్. ఈ.రమణ రావు, ఆర్ అండ్ బి ఈ ఈ లోకేష్, జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్, బీసీ సంక్షేమ అధికారి జి రమేష్, గనుల శాఖ టెక్నీషియన్ శంకరు తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *