-దీపం పథకం అర్హులకు రూ.164 కోట్లు లబ్ధి
-డిబిటి ద్వారా బదిలీ
సాలూరు (పార్వతీపురం మన్యం), నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో దీపం-2 పథకం క్రింద 1,97,727 మందిని అర్హులుగా గుర్తించడం జరిగిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి అన్నారు. దీపం-2 పథకం క్రింద ౩ ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఆమె చెప్పారు. దీపం పథకంను శుక్రవారం సాలూరు పట్టణంలో మంత్రి ప్రారంభించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అర్హులు అయిన పేద కుటుంబాలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ లు ఉచితంగా అందజేయుటకు అక్టోబర్ 31 నుండి శ్రీ కారం చట్టిందని చెప్పారు. జిల్లాలో 1,97,727 మంది దీపం పథకం అర్హులకు రూ.164 కోట్లు లబ్ధి చేకూరుతుందని మంత్రి తెలిపారు. ఈ మొత్తాన్ని డిబిటి (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ద్వారా జమ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
ఈ పధకం పొందుటకు ఆధార్ కార్డు నెంబరు, రేషన్ / బియ్యం కార్డు నెంబరు, ఆధార్ నెంబరుతో లింకు చేసిన బ్యాంకు ఖాతా (ఎకౌంటు) నెంబరు, గ్యాస్ కనెక్షన్ నెంబరు ఉంటే సరిపోతుందని ఆమె వివరించారు. లబ్దిదారులు తమ వివరాలు లేకపోతే ఆయా సంస్థలు, శాఖల నుండి వివరాలు పొంది నమోదు చేసుకొని ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందవచ్చని ఆమె వివరించారు.
దీపం పథకంలో భాగంగా లబ్దిదారులు తమ గ్యాస్ ఏజెన్సీ లో గ్యాస్ కు బుకింగ్ చేసి గ్యాస్ ధర, గ్యాస్ ఏజెన్సీ వారికి మొదట చెల్లించాలని, అనంతరం అర్హులైన లబ్దిదారుకు మొబైల్ నెంబరుకు మెసేజ్ వస్తుందన్నారు. మెసేజ్ వచ్చిన లబ్దిదారుకు గ్యాస్ ఏజెన్సీకి చెల్లించిన మొత్తము పైకం తిరిగి వస్తుందని ఆమె అన్నారు. పట్టణ ప్రాంతాల వారికి 24 గంటలలోగాను, గ్రామీణ ప్రాంతాల వారికి 48 గంటలలోగా వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని మంత్రి తెలిపారు.
మొదటిసారి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందుటకు లబ్దిదారులు అక్టోబర్ 29 నుండి 2025 మార్చి 31వ తేదీ వరకు గ్యాస్ ఏజెన్సీ వద్ద బుకింగ్ చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఐదు నెలల సుదీర్ఘ సమయం ఇవ్వడం జరిగిందని, లబ్దిదారులు ఎవరూ గ్యాస్ బుకింగ్ కు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.
నాలుగు నెలలకు ఒకసారి మూడు సిలిండర్లు ఉచితంగా అందజేయడం జరుగుతుందని ఆమె అన్నారు. ఈ సిలిండర్లు ఏప్రిల్ నుండి జూలై వరకు, ఆగస్ట్ నుండి నవంబర్ వరకు, డిసెంబర్ నుండి మార్చి వరకు పంపిణీ జరుగుతుందని తెలిపారు. దీపం పథకం క్రింద సమస్యలు ఉంటే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్సు) లో పిర్యాదు చేసుకునే వెసులబాటును ప్రభుత్వం కల్పించిందని మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఆర్ధికంగా మేలు చేయుటకు ఉద్దేశించిన ఈ పథకంa, లభ్దిదారులు వినియోగించుకోవాలని ఆమె కోరారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో 16 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో 2,72,757 గ్యాస్ కనక్షన్స్ ఉన్నాయని, వీటిలో 1,97,727 మందిని దీపం-2 (౩ ఉచిత గ్యాస్ సిలిండర్) పధకం అర్హులుగా గుర్తించడం జరిగిందని మంత్రి చెప్పారు. గ్యాస్ సిలిండర్ ధర రూ. 827.50 పైసలుగా ఉండగా పౌరులందరికీ కేంద్ర ప్రభుత్వం నుండి రూ.10.80 పైసలు సబ్సిడీ వస్తుందని అన్నారు. ఉజ్వల గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం నుండి సబ్సిడీ రూపములో రు.10.80 పైసలుతో పాటు అదనముగా రూ.300 కేంద్ర ప్రభుత్వం నుండి సబ్సిడీ రూపములో వస్తుందని ఆమె వివరించారు.
దీపం-2 పథకంలో గల లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం నుండి రు 10.80 పైసలు, రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ.816.70 పైసలు సిలిండర్ విడిపించిన సమయం నుండి 48 గంటలలో వారి బ్యాంకు ఖాతాకు జమ చేయబడుతుందని మంత్రి చెప్పారు. జిల్లాలో 1,97,727 మంది దీపం పథకం అర్హులకు రూ.164 కోట్లు లబ్ధి చేకూరుతుందని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News