Breaking News

గుంతల రహిత జిల్లా లక్ష్యంగా రహదారుల అభివృద్ధి… : జిల్లా కలెక్టర్

కేసరపల్లి (గన్నవరం), నేటి పత్రిక ప్రజావార్త :
గుంతల రహిత జిల్లా లక్ష్యంగా రహదారుల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ (మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఏపీ) కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం గన్నవరం మండలంలోని కేసరపల్లి గ్రామంలో ఆయన స్థానిక కూటమి నాయకులు, ఇతర అధికారులతో కలిసి రహదారుల మరమ్మతులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమం అమలులో భాగంగా జిల్లాలో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టేందుకు కేసరపల్లి నుంచి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలలోని రహదారుల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొదటి ప్రాధాన్యతగా 45 పనులకు సంబంధించి రూ.14.76 కోట్లు మంజూరు అయ్యాయని, వీటికి అదనంగా మిగిలిన పనులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు నాణ్యతతో కూడిన పనులు చేపట్టి వచ్చే సంక్రాంతి లోపు గుంతల రహిత జిల్లా లక్ష్యంగా రహదారుల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. గన్నవరం నియోజకవర్గంలోని రాష్ట్ర రహదారి రోడ్లు, ప్రధాన జిల్లా రహదారుల మరమ్మతుల నిమిత్తం మొత్తం రూ.3.83 కోట్లు తొలి విడతగా మంజూరైనట్లు, అదేవిధంగా మరో రూ.3.61 కోట్ల పనులకు ప్రభుత్వానికి అంచనాలు తయారు చేసి పంపించినట్లు రహదారులు భవనాల శాఖ అధికారులు వివరించారు.

ఈ కార్యక్రమంలో గుడివాడ రెవెన్యూ డివిజన్ అధికారి జి బాలసుబ్రమణ్యం, రహదారులు భవనాల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ లోకేష్, గ్రామ సర్పంచ్ చేబ్రోలు లక్ష్మీ మౌనిక, ఎంపీడీవో టి స్వర్ణలత, తహసిల్దార్ శివయ్య, కూటమి నాయకులు వడ్రాణం హరిబాబు, యార్లగడ్డ సతీష్ బాబు, జాస్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *