-ప్రజల సమస్యలను సంయుక్త పరిశీలనతో పరిష్కరించండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుండి నిత్యం ఫిర్యాదులు వస్తేనే పనిచేసేలా కాకుండా ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ఉండేటట్టు పనిచేయాలని, ప్రతి సచివాలయం పరిధిలో నిత్యం పర్యవేక్షిస్తూ సంయుక్త పరిశీలనలో ప్రజల సమస్యలను పరిష్కరించాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సచివాలయం సెక్రటరీలతో అన్నారు. శనివారం ఉదయం తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో 286 సచివాలయాల ప్రణాళిక, శానిటరీ, ఎమినిటీస్, సెక్రటరీలతో సంయుక్త పర్యవేక్షణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గత రెండు వారాలుగా చేస్తున్న సంయుక్త పర్యవేక్షణలో సెక్రటరీలు గుర్తించిన సమస్యలేంటి వంటి విషయాలపై చర్చించారు.
సంయుక్త పరిశీలన చేస్తున్నప్పటికీ ప్రజలకు ఇంకా సమస్యలు ఎందుకు ఉన్నాయి వంటి విషయాలపై విశ్లేషించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మూడు సర్కిలలోనూ, సర్కిల్ కి ఒక సచివాలయం బృందంతో వారు ఈ సంయుక్త పరిశీలనలో ఏమి గమనించారు ఎటువంటి సమస్యలను పరిష్కరించారు ప్రజల స్పందన ఎలా ఉంది అన్న అంశాలపై అడిగారు. అనధికార కట్టడాలు, ఖాళీ స్థలాలు, వ్యర్ధాలను ఇంటి వద్దనే వేరు చేయడం లాంటి విషయాలపై సెక్రటరీలతో చర్చించి ప్రజలకు ప్లాన్ లేనిదే ఇల్లు కట్టరాదని, ఖాళీ స్థలాలలో వ్యర్ధాలు వేయకూడదని, తడి చెత్త పొడి చెత్తను ఇంటి వద్ద నీ పేరు చేయడం లాంటి అంశాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. సచివాలయం సిబ్బంది అందరూ సమన్వయంతో పని చేస్తే ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించగలరని అన్నారు. ప్రజల నుండి ఫిర్యాదులు వస్తే కాదు, ఫిర్యాదులు రాకుండా పనిచేయాలని సచివాలయం సిబ్బందికి స్ఫూర్తిని నింపి, సెక్రటరీలు అందరూ వారి సచివాలయ పరిధిలో ఉన్న సమస్యలపై ఇళ్లపై కచ్చితమైన అవగాహన ఉండాలని తెలిపారు.
ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, జోనల్ కమిషనర్లు రమ్య కీర్తన, ప్రభుదాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ సిటీ ప్లానర్లు,అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సిటీ ప్లానర్, అసిస్టెంట్ ఇంజనీర్లు, సచివాలయం స్పెషల్ ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News