– బాల్య వివాహం నుంచి 15 ఏళ్ల అమ్మాయిని కాపాడిన ఐసీడీఎస్ సిబ్బంది
– జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి జి.ఉమాదేవి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎవరైనా బాల్య వివాహాలు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎన్‌టీఆర్ జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి జి.ఉమాదేవి.హెచ్చరించారు. బాల్య వివాహాల నిరోధానికి క్షేత్రస్థాయిలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని.. విజయవాడ రూరల్, అంబాపురానికి చెందిన 15 ఏళ్ల ఓ అమ్మాయిని కడప జిల్లాకు చెందిన 34 ఏళ్ల ఓ వ్యక్తితో శుక్రవారం వివాహం చేసేందుకు ప్రయత్నించగా అక్కడి ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారని.. సమాచారాన్ని ఇక్కడి అధికారులకు తెలియజేయగా, తండ్రి, బంధువులతో మాట్లాడి అమ్మాయిని తీసుకొచ్చి సీడబ్ల్యూసీ బెంచ్ ముందు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. షార్ట్ స్టే హోం కింద అమ్మాయికి ప్రజ్వల హోంలో ఆశ్రయం కల్పించినట్లు తెలిపారు. అమ్మాయి తల్లి ఎనిమిది నెలల క్రితమే చనిపోయారని, తండ్రి మద్యానికి బానిస అయినట్లు తెలిపారు. ఎవరైనా బాల్య వివాహాలు చేసేందుకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఉమాదేవి హెచ్చరించారు. బాల్య వివాహాల వల్ల తలెత్తే పరిణామాలు, చట్టపర చర్యలు తదితరాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News