పొగాకు వినియోగం క్యాన్సర్‌కు ఆహ్వానం

-విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
పొగాకు వినియోగం క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుందని, విద్యార్థులు చిన్న వయస్సు నుంచే పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని జిల్లా కెరీర్ మరియు మానసిక ఆరోగ్య సలహాదారు, సమగ్ర శిక్షా, ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి సిద్ధినేని వనదుర్గ సూచించారు.
నవజీవన్ బాల భవన్ ఆధ్వర్యంలో వన్‌టౌన్‌లోని మౌలానా ఆజాద్ మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాలలో “పొగాకు వినియోగం – క్యాన్సర్‌కు ఆహ్వానం” అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వనదుర్గ మాట్లాడుతూ, పొగాకు వినియోగం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తడమే కాకుండా కుటుంబాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. విద్యార్థులు పొగాకు దుష్ప్రభావాలపై అవగాహన పెంపొందించుకుని, తమ కుటుంబ సభ్యులకు, సమాజానికి కూడా చైతన్యం కల్పించాలని కోరారు.
ఈ పోటీలో విద్యార్థులు పొగాకు వినియోగం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, కుటుంబాలపై దాని ప్రభావం, పొగాకు నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి తమ వ్యాసాల్లో వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె. కళ్యాణి పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. నీతోడు మానసిక వికాస కేంద్రం (N-ICC) జోనల్ కోఆర్డినేటర్లు పెండెం విజయ్ కుమార్, ఎన్. దేవమణి విద్యార్థులకు పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.
వ్యాసరచన పోటీలో తాజ్ కౌసర్ మొదటి బహుమతి, ఎస్.కె. ఇలియాజ్ రెండవ బహుమతి, ఫర్హా జీన్ మూడవ బహుమతి సాధించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.