Breaking News

2021 తర్వాత ఆగిపోయిన నిధులను పునరుద్ధరించండి

-మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వడానికి రాష్ట్రం సిద్ధంగా ఉంది
-కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రతన్ సింగ్ కి విజ్ఞప్తి చేసిన ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పంచాయతీరాజ్ వ్యవస్థను సమ్మిళతం చేసి ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు ప్రతిపాదించిన రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ (ఆర్జీఎస్ఏ) ప్రోగ్రాం కింద ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి అందాల్సిన నిధులు 2021 నుంచి కొన్ని కారణాలరీత్యా అందలేదని, వాటిని వెంటనే విడుదల చేయాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రతన్ సింగ్ ని కలసి ఉప ముఖ్యమంత్రివర్యులు  పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయిన  పవన్ కళ్యాణ్  మంగళవారం రాజీవ్ రతన్ సింగ్ తో భేటీ అయి, పంచాయతీరాజ్ నిధులు, కేంద్ర ప్రోత్సాహకం, సహకారంతోపాటు కీలకమైన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రతిపాదిత అంశాలను  పవన్ కళ్యాణ్  కేంద్ర మంత్రి ముందు ఉంచారు.
‘‘పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేసేందుకు అవసరమైన భవనాల నిర్మాణం, సిబ్బందికి శిక్షణ, సౌకర్యాల కల్పనకు ఉద్దేశించిన రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ యోజన పథకం కింద 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ రూ.215.8 కోట్లకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అయితే ఈ పథకం కింద 2021 సంవత్సరం తర్వాత రాష్ట్రానికి నిధుల విడుదల పూర్తిగా ఆగిపోయింది. అయితే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి 40 శాతం మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వడానికి, బ్యాక్ లాగ్ నిధులకు సంబంధించిన మ్యాచింగ్ గ్రాంటు రూ.42.26 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ప్రతిపాదించిన నిధుల్లో మొదటి విడతగా రూ.107.90 కోట్లను వెంటనే విడుదల చేయండి. 3 లక్షల మంది ఉద్యోగులకు శిక్షణ, రెండు డీపీఆర్సీ భవనాల నిర్మాణం, 200 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, 500 మారుమూల గ్రామ పంచాయతీలకు కంప్యూటర్ల ఏర్పాటు అవసరం ఉంది. వాటికి ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయి.
అలాగే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఏపీఎస్ఐఆర్డీపీఆర్)కి శాశ్వత భవనం లేదు. దీని నిర్మాణ నిమిత్తం రూ.20 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

• కేంద్రానికి కృతజ్ఞతలు
15వ ఆర్థిక సంఘం నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ, రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతున్న కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సెప్టెంబరులో మొదటి విడత నిధులుగా రూ.998.74 కోట్లు విడుదల చేయడం సంతోషకరం. రెండో విడత నిధుల కోసం రూ.1052.46 కోట్లను ప్రతిపాదించడం జరిగింది. అలాగే గతంలో వివిధ కారణాలరీత్యా పెండింగ్ లో ఉండిపోయిన రూ.63.73 కోట్ల నిధులను కూడా రెండో విడత నిధులతో విడుదల చేయాల”ని కోరారు.

Check Also

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *