– డాక్టర్. ఏ. సిరి, ఏపీ శాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ వ్యాప్తంగా 2030 నాటికి హెచ్‌ఐవీని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఏపీ శాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్. ఏ. సిరి తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఎయిడ్స్ పై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఏపీ శాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్. ఏ. సిరి మాట్లాడుతూ రాష్ట్రంలో హెచ్‌ఐవీ వైరస్ బారిన పడే వారిలో యువత ఎక్కువగా ఉంటున్నారని, ఇది చాలా బాధాకరమైన విషయమన్నారు. ఎయిడ్స్ మహమ్మారిపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. “టేక్ ది రైట్స్ పాత్” అనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో దాదాపు 3 లక్షల 25 వేల మందికి హెచ్‌ఐవీ ఉన్నట్లు అంచనాలు ఉన్నాయన్నారు. ఇందులో 2 లక్షల 75 వేల మంది మాత్రమే చికిత్స తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో యువతకు 50 కి.మీ. కన్నా తక్కువ దూరంలో లింక్ ఏఆర్‌టీ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల వీడియోలు ద్వారా చిన్న చిన్న నాటికల ద్వారా, రైల్వే స్టేషన్లో బస్టాండ్ లో ఉన్న టెలివిజన్లో మరియు రేడియో జంగిల్ ద్వారా కళా జాతర ప్రోగ్రామ్స్ ద్వారా ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడతున్నామన్నారు. హెచ్ఐవి బారిన పడినవారు సక్రమమైన పద్ధతిలో మందులు వాడుతూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడప వలసిందిగా కోరడం జరిగింది..
ఏపీ శాక్స్ అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ సరస్వతి మాట్లాడుతూ హెచ్ఐవి నిర్మూలన మన అందరి బాధ్యత అని, అది అవగాహనతోనే సాధ్యమవుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల్లో మనోధైర్యం వస్తుందన్నారు. సమాజం వీరిని అక్కున చేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హెచ్ఐవీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.
కార్యక్రమంలో జేడీలు డాక్టర్. టి. మంజుల, డాక్టర్. కామేశ్వర్ ప్రసాద్, డాక్టర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ డైరెక్టర్ డా. చక్రవర్తి, అడిషనల్ డీఎం అండ్ హెచ్వో డా. జే. ఉషారాణి, కోఆర్డినేటర్ డా.రాజేంద్రప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ ఎం. పద్మావతి, డాక్టర్. సమరం తదితరలు పాల్గొన్నారు. తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ గ్రౌండ్ నుంచి తుమ్మల పల్లి కళా క్షేత్రం వరకు ఎయిడ్స్ అవగాహనపై అనేక నినాదాలు ఇస్తూ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఏపీ శాక్స్ ఆధ్వర్యంలో విభిన్న విభాగాలలో పనిచేస్తూ ఉత్తమ ప్రతిభను కనపరిచిన వారిని అభినందిస్తూ సర్టిఫికేట్, మెమొంటోలను అందించడం జరిగింది. తదుపరి వినూత్న రీతిలో సోషల్ మీడియా లో ఫ్లాస్మాబ్స్ ద్వారా అవగాహన కల్పించడానికి యువత ముందుకు రావడంతో వారిని అభినందిస్తూ మెమొంటోలు, సర్టిఫికెట్లు అందించారు.
Prajavartha Online Telugu News