Breaking News

నిరుద్యోగ యువతను వైసీపీ నయవంచనకు గురి చేసింది… : పవన్ కల్యాణ్

-రెండున్నర లక్షల ఉద్యోగాలని హామీ… పాలనలోకి వచ్చిన రెండేళ్ల తరవాత 10వేల ఉద్యోగాలంటారా?
-వైసీపీ రాజకీయ నిరుద్యోగులకు పదవులు సృష్టించారు… నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేరా?
-నిరుద్యోగ యువత కోసం అన్ని జిల్లాల్లో జనసేన కార్యక్రమాలు…
-యువతకు న్యాయం జరిగే వరకూ జనసేన అండగా ఉంటుంది
-జనసేన అధ్యక్షులు  పవన్ కల్యాణ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న పరిస్థితి, నయవంచనకు గురయ్యామనే వేదన అందరినీ కలచి వేస్తున్నట్లు జనసేన అధ్యక్షులు  పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీకి 151మంది ఎమ్మెల్యేలతో అంత మెజారిటీ చట్టసభల్లో దక్కడంలో ఆ 30 లక్షల మంది నిరుద్యోగ యువత ప్రధాన కారణమయ్యారు అన్నారు. ఎన్నికలకు ముందు రెండున్నర లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వైసీపీ ఇచ్చిన హామీని విశ్వసించి అన్ని సీట్లు ఇస్తే అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరవాత 10 వేల ఉద్యోగాలు ఇస్తామనడంతో యువత తాము వంచనకు గురయ్యామని ఆవేదనతో ఉన్నారని తెలిపారు. ఎక్కడ రెండున్నరలక్షల ఉద్యోగాల హామీ… ఎక్కడ పది వేల ఉద్యోగాల భర్తీ అని ప్రశ్నించారు. వంచనకు గురై దెబ్బ తిని రోడ్డున పడ్డామనే ఆవేదనతో నిరాశానిస్పృహలకు లోనై ఉన్నారన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండరుపై ఆందోళన చెందుతున్న నిరుద్యోగ యువతకు బాసటగా నిలుస్తూ జనసేన పార్టీ మంగళవారం అన్ని జిల్లాల్లో ఎంప్లాయ్మెంట్ అధికారి కార్యాలయంలో వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ అంశంపై సోమవారం  పవన్ కల్యాణ్  వీడియో సందేశం విడుదల చేశారు.
పవన్ కల్యాణ్  మాట్లాడుతూ “రెండున్నర లక్షల ఉద్యోగాల హామీని నిరుద్యోగ యువత నమ్మింది. 30 లక్షల మంది యువతీయువకులు ఉద్యోగాల కోసం ఆశగా చూస్తున్నారు. పోలీసు విభాగంలో 74వేల ఉద్యోగాలు ఉన్నాయని గుర్తించి బడ్జెట్ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఏటా 6 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఇప్పుడు జాబ్ క్యాలెండరులో 460 పోస్టులే చూపించారు. పోలీస్ ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకొని సిద్దమవుతున్న యువతీయువకుల పరిస్థితి ఏమిటి?
ఉపాధ్యాయ ఉద్యోగాల ఊసే లేదు?
25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న లక్షల మంది ఆ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యారు. అసలు ఉపాధ్యాయ ఉద్యోగాల ఊసే లేదు. రెండు వేల వరకూ గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. జాబ్ క్యాలెండర్లో 34 పోస్టులు మాత్రమే ప్రకటించారు. 30 లక్షల మంది అర్హులు ఉంటే 34 ఉద్యోగాలా?
పట్టు బట్టలు… బంగారం అక్కరలేదు… భవిష్యత్ ఇవ్వండి
ఉద్యోగాలు వస్తాయని యువత ఢిల్లీకి వెళ్ళి, హైదరాబాద్ వెళ్ళి, అవనిగడ్డ వెళ్ళి… వేరే నగరాలకు వెళ్ళి కోచింగ్ తీసుకొంటున్నారు. వారందరి పరిస్థితి ఏమిటి? ఇటీవల మంగళగిరి వెళ్ళినప్పుడు నిరుద్యోగ యువత కలిసి తమ ఆవేదనను తెలియచేశారు. కోచింగ్ ల కోసం ఎక్కడెక్కడో ఉండి కష్టపడి చదువుకొంటూ ఉన్నామనీ, అర్హతలు ఉన్నా ఉద్యోగాలు లభించని పరిస్థితి ఈ జాబ్ క్యాలెండర్ వల్ల నెలకొందని ఆవేదనకు లోనయ్యారు. ఈ అంశంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో చర్చించి నిరుద్యోగ యువతకు అండగా నిలవాలని నిర్ణయించాం.
పట్టు బట్టలు, బంగారం ఇవ్వక్కరలేదు. చక్కటి భవిష్యత్ ఇవ్వండి చాలు. తమ పార్టీలోని రాజకీయ నిరుద్యోగుల కోసం లేని పదవులు, కొత్తకొత్త పదవులు సృష్టించి ఉపాధి కల్పించిన వైసీపీ ప్రభుత్వం… ఉన్న ఉద్యోగాలను ఎందుకు ఇవ్వడం లేదు… తమ పార్టీ వారిపై ఉన్న శ్రద్ధ, హామీ ఇచ్చిన 2.5 లక్షల ఉద్యోగాలపై ఎందుకు లేదని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు జనసేన పార్టీ మంగళవారం అన్ని జిల్లా కేంద్రాల్లో కార్యక్రమం చేపడుతుంది. జన సైనికులు, నాయకులు నిరుద్యోగ యువతను కలుపుకొని జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజీల దగ్గరకు వెళ్ళి వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన 2.5 లక్షల ఉద్యోగాల హామీని గుర్తు చేస్తూ వినతి పత్రాలు అందచేస్తారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకూ జనసేన పార్టీ అండగా ఉంటుంది అని మరోసారి స్పష్టం చేశారు.

Check Also

అవగాహన ఒప్పందం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విధ్యా సంస్థ ప్రధాన కార్యాలయం, తాడేపల్లి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *