-రోడ్డుతో పాటు డ్రైనేజీ, పంపింగ్ స్టేషన్ల నిర్మాణానికి చర్యలు
-కార్పోరేషన్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, కన్సల్టెంట్స్తో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా రిటైనింగ్ వాల్ పక్కన రోడ్డుతో పాటుగా డ్రైనేజీ, పంపింగ్ స్టేషన్ల నిర్మాణం పూర్తి చేసి అక్కడి నివాసులకు ఏవిధమైన ఇబ్బంది లేకుండా జీవనం సాగించేలా చూడాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కార్పోరేషన్ ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఉదయం పటమట అశోక్‌నగర్‌లోని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుని కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు ప్రాజెక్టుల గురించి ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కార్పోరేషన్ ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులు, కన్సల్టెంట్స్తో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్, కార్పోరేషన్ సీఈ శ్రీధర్ రెడ్డి, ఈఈ సామ్రాజ్యంతో పాటుగా కన్సల్టెంట్స్ ప్రతినిధులు కేవీ మనోజ్, కృష్ణ చైతన్య మరియు గద్దె రమేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గ పరిధిలోని రామలింగేశ్వరనగర్‌లోని రుద్రభూమి దగ్గర నుంచి భూపేష్గుప్తా నగర్ వరకు కృష్ణా రిటైనింగ్ వాల్ పక్కన రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పారు. రిటైనింగ్ వాల్ పక్కన రోడ్డు, డైనేజీ సౌకర్యంతో పాటుగా జనరేటర్లతో కూడిన ఐదు పంపింగ్ స్టేషన్లు నిర్మాణం చేసేందుకు ఎస్టిమెషన్లు తయారు చేయాలని సూచించారు. రోడ్డు, పంపింగ్ స్టేషన్ల నిర్మాణ పనులను ఏవిధంగా ముందుకు తీసుకువెళ్ళాలనే అంశంపై కార్పోరేషన్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, కన్సల్టెంట్స్తో చర్చించామన్నారు. కృష్ణా రిటైనింగ్ వాల్ నిర్మాణం పరిపూర్ణం కావాలంటే రిటైనింగ్‌వాల్ వెంట 70 అడుగల మేర రోడ్డు, డ్రైనేజీ సౌకర్యంతో పాటుగా పంపింగ్ స్టేషన్లు నిర్మాణం పూర్తి అయితేనే రిటైనింగ్ వాల్ పనులు పూర్తి అయినట్లు అని అన్నారు. 2014–19 సంవత్సరంలో టీడీపీ హాయంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇక్కడ రోడ్డు, పంపింగ్ స్టేషన్ల నిర్మాణ పనులకు సంబంధించి ప్రణాళికులు రూపొందించారని, రిటైనింగ్ వాల్ పూర్తి అయ్యే దశలో ఎన్నికలు రావడంతో తర్వాత అధికారం చేపట్టిన వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ పనులను పట్టించుకోలేదన్నారు. అందువల్ల ఇటీవల వరదలు వచ్చినప్పుడు కృష్ణలంక ప్రాంతంలో వరద నీరు ఇళ్ళల్లోకి వచ్చాయని చెప్పారు. అందువల్ల ఇప్పుడు రిటైనింగ్ వాల్ పక్కనే రోడ్డు నిర్మాణంతో పాటుగా జనరేటర్‌తో కూడిన ఐదు పంపింగ్ స్టేషన్లను నిర్మాణం చేపట్టనున్నామని చెప్పారు. వరదలు వచ్చినా చుక్క నీరు కూడా ఇంటి పరిసరాల్లోకి రాకుండా పంపింగ్ స్టేషన్లను నిర్మాణం చేయనున్నామన్నారు. ఈ పనులపై చర్చించేందుకు ప్రత్యేకంగా ఈ సమావేశం నిర్వహించామని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తూర్పు నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ చూపించి ఇక్కడి సమస్యల పరిష్కారానికి నిధులను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కృతజ్ఞతలు తెలిపారు.