తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
76 వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఘనంగా నిర్వహించుటకు పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ మణికంఠ చందోలు, జెసి శుభం బన్సల్, మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి మౌర్య తదితర సంబంధిత అధికారులతో కలిసి ఈ నెల 26 న నిర్వహించనున్న 76 వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి అధికారులతో జూమ్ సమావేశము నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ నెల 26 న పోలీసు పెరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించడం జరుగుతుందని,ఈ కార్యక్రమాన్ని పూర్తి పర్యవేక్షణ ఆర్డిఓ చేయాలని, గ్రౌండ్ నందు బందోబస్తు, జెండా వందనం, స్టేజ్ డెకరేషన్ ను, కవాతు ఏర్పాట్లను పోలీస్ శాఖ, సీటింగ్ ఏర్పాట్లను అర్బన్ తహశీల్దార్, విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమ నిర్వహణ డిఈఓ చూడాలని, ప్రథమ చికిత్స కేంద్రం మరియు అత్యవసర వైద్య సేవల ఏర్పాట్లను డి ఎం అండ్ హెచ్ ఓ, పారిశుద్ధ్యం, త్రాగునీరు ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్, గ్రామీణ నీటి సరఫరా ఎస్ఈ ఏర్పాట్లు చేయాలన్నారు.
ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల పై స్టాల్స్ మరియు శకటాలను సంబంధిత శాఖలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని వివిధ శాఖలు సాధించిన ప్రగతి నివేదికను క్రోడీకరించి స్పీచ్ నోట్ రూపొందించడం, పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ ఏర్పాటను సమాచార పౌర సంబంధాల శాఖ పర్యవేక్షించాలని, వివిధ శాఖలలో పనిచేసిన వారి నైపుణ్యాలను గుర్తించి జాబితాను వెంటనే కలెక్టర్ కార్యాలయమునకు పంపించాలన్నారు. ఏపీ ఎస్పీడీసీఎల్ వారు నిరంతర పవర్ సప్లై ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవ్వరికి కేటాయించిన పనులను వారు సక్రమంగా నిర్వహించాలన్నారు.
ఈ జూమ్ కాన్ఫరెన్స్ నందు డిఆర్ఓ నరసింహులు కలెక్టరేట్ ఏవో భారతి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.