-నూతన సంవత్సరంలో క్లీన్ స్టార్ట్ అనే థీమ్ మన ఇల్లు, మన ఆఫీసు, సచివాలయాలు, బస్టాండ్లు, పరిసరాల పరిశుభ్రత పాటించాలి
-స్వచ్చాంధ్ర – స్వచ్చ దివస్ పై మున్సిపల్ కమీషనర్ లు, జిల్లా, మండల స్థాయి అధికారులతో టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన తిరుపతి జిల్లాలో ప్రతి నెల మూడవ శనివారం స్వచ్చాంద్ర – స్వచ్చ దివస్ ను నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ టెలి కాన్ఫెరెన్స్ ద్వారా మునిసిపల్ కమీషనర్ లు,జిల్లా, మండల స్థాయి అధికారులకు దిశా నిర్దేశం చేసారు.
స్వచ్చాంద్ర – స్వచ్ దివస్ కార్యక్రమం నిర్వహణపై శుక్రవారం ఉదయం స్థానిక కల్లెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ నుండి జిల్లా అధికారులు, మునిసిపల్ కమీషనర్ లు, మండల స్థాయి అధికారులకు టెలి కాన్ఫెరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం ప్రత్యేకమైన పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించాలని, స్వచ్చాంద్ర – స్వచ్ దివస్ కార్యక్రమం లో భాగంగా ఏప్రిల్ 2025 లోపు ఇంటింటి చెత్త సేకరణ 100 శాతం నిర్వహించేలా చేయడం, అక్టోబర్ 2025 లోపు చెత్తకుప్పలు లేకుండా చేయాలన్నదే ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. నూతన సంవత్సరంలో క్లీన్ స్టార్ట్ అనే థీమ్ మన ఇల్లు, మన ఆఫీసు, సచివాలయాలు, బస్టాండ్లు, పరిసరాల పరిశుభ్రత పాటించడం చేయాలని అన్నారు. ఇందులో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయం, సచివాలయాలు, గ్రామాలనందు చెత్త కుప్పలు లేకుండా తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించాలన్నారు. ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలన్నారు. ప్రతి నెల మూడవ శనివారం పరిశుభ్రత పనులు చేసి, ప్రజలకు పరిశుభ్రతపైన అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యవంతులు చేస్తూ మానవహారం తదితర ఏర్పాటు చేయాలని, చెత్తకుప్పలను తొలగించి ఆ స్థలంలో చెట్లు నాటే కార్యక్రమం చేయాలని సూచించారు. మురుగు కాలువలను శుభ్రం చేయించాలని, ప్రజలు తడి, పొడి చెత్త వేర్వేరుగా పారిశుధ్య కార్మికులకు ఇవ్వాలని, కాలువల్లో వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ తెలిపారు.
ఈ టెలికాన్ఫెరెన్స్ నందు మున్సిపల్ కమీషనర్ లు, ఆర్ డి ఓ లు, పంచాయతీ రాజ్ అధికారులు, సంబందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.