-ప్రభుత్వ ఆసుపత్రులు అంగన్‌వాడీ కేంద్రాలలో పచ్ఛదనం పరిశుభ్రతను పాటించాలి..
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్య ఆరోగ్య శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంలో మహిళలు బాలికలలో రక్తహీనత నివారణ, మతాశిశు మరణాల కట్టడికి కృషి చేయడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం పచ్చదనం పరిశుభ్రత కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై శుక్రవారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం అందించాలని ముఖ్యంగా బాలికలు మహిళలలో రక్తహీనతను నివారించడం మాతా శిశు మరణాలను పూర్తిగా ఆరికట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. క్షేత్ర స్థాయిలో ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రతి ఇంటిని సందర్శించి 10 నుండి 19 సంవత్సరాల వయస్సులోపు కలిగిన బాలికలు, 15 నుండి 49 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన మహిళలకు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి రక్తహీనతను గుర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రక్తహీనత కలిగిన వారికి అవసరమైన ఐరన్ టాబ్లెట్స్, ఇంజక్షన్లను, పౌష్టికాహారం అందించి రక్తహీనతను నివారించేందుకు వైద్య మహిళా శిశు సంక్షేమ అధికారులు సంయుక్తంగా చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణీ స్త్రీలను గుర్తించి వారికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలను నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేయాలని సాధ్యమైనంతమేరకు ప్రభుత్వ ఆసుపతిలో ప్రసవం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది తరచు గర్భిణీల ఇళ్లను సందర్శించి రక్తహీనత సమస్య ఏర్పడకుండా పౌష్టికాహారం తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. మాతా, శిశు సంరక్షణకు ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకునేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపకుండా చూడాలన్నారు. రిజిస్ట్రేషన్ దగ్గరి నుంచి గర్భిణీల ఆరోగ్యం వివరాలను ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేయాలని, ముప్పు అధికంగా (హైరిస్క్) ఉన్నవారి పట్ల వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. జిల్లాలో నిర్వహిస్తున్న స్వచ్చఆంధ్ర ` స్వచ్ఛ్ దివస్ కార్యక్రమాన్ని అమలు చేయడంలో వైద్య ఆరోగ్య మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతి మూడవ శనివారం పచ్ఛదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించి ఆసుపత్రులు ప్రాంగణాలను పరిశుభ్ర పరిచి ఆహ్లాదకరమైన వాతావారణాన్ని కల్పించేలా వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను పరిశుభ్ర పరిచి పౌష్టికాహారానికి సంబంధించిన ఆకుకూరలు, కూరగాయల మొక్కలను పెంచాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సంబంధిత అధికారులకు సూచించారు.
సమావేశంలో డియంహెచ్‌వో యం. సుహాసిని, డిసిహెచ్‌ఎస్ డిసికె నాయక్, ఎన్‌టిఆర్ ఆరోగ్య ట్రస్ట్ జిల్లా కో`ఆర్డినేటర్ జె. సుమన్, మహిళా శిశు సంక్షేమ శాఖ సిడిపివోలు జి. మంగమ్మ, కె. నాగమణి, లక్ష్మీ బార్గవి, భాగ్యరేణుక, సత్యవతి, పుష్పవతి, నోడల్ ఆఫీసర్ సాయి గీత, ప్రోగ్రాం ఆఫీసర్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.