కాటూరు (ఉయ్యూరు), నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమం ద్వారా పట్టణాలు, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్నారు.
శనివారం ఆయన ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో స్థానిక శాసనసభ్యులు బోడె ప్రసాద్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బాగంగా గ్రామంలో రహదారులను, డ్రైనేజ్, పరిసరాలను పరిశుభ్రం చేసి గ్రామస్తులకు స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమ ప్రాముఖ్యతను, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. గ్రామ సచివాలయం వద్ద మొక్కలు నాటారు. తడి పొడి చెత్తను వేరు చేసే డస్ట్ బిన్ లను గ్రామస్తులకు పంపిణీ చేశారు.
అనంతరం నేను, నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతి రోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కోసం శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ… ఈరోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని సిఎస్ అధికారులు, గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణాలు, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంతో ప్రజలకు పిలుపునిచ్చారన్నారు.
ఇది ఒకరోజు కార్యక్రమం కాదని నిరంతర ప్రక్రియ అని చెబుతూ, ప్రతి నెలలో మూడో శనివారం నాడు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలందరూ భాగస్వామ్యం అయ్యి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు, సిబ్బంది పరిసరాలను శుభ్రం చేసుకుని ఆదర్శంగా ఉంటూ ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛ్ ఆంధ్ర లక్ష్యానికి కృషి చేయాలన్నారు.
అలాగే చెత్త నుండి సంపద సృష్టిలో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేపట్టడంతో పాటు వ్యర్థాల నిర్వహణ సక్రమంగా చేపట్టడానికి పది రకాల కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత చేపట్టేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
పెనమలూరు శాసనసభ్యులు బోడె ప్రసాద్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలన్నారు. కలుషితంకాని పర్యావరణాన్ని భవిష్యత్తు తరాల వారికి అందించినప్పుడే నిజమైన సంపదని పేర్కొన్నారు. తడి పొడి చెత్త నిర్వహణకు స్వచ్ఛ ఆంధ్ర మిషన్ కార్యక్రమం ద్వారా అవసరమైన సామాగ్రిని అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో కన్నమనాయుడు, డిపిఓ జె అరుణ, డ్వామా పీడీ కేవీ శివప్రసాద్, ఎంపీడీవో శేషగిరిరావు, తహసిల్దార్ సురేష్ కుమార్, గ్రామ సర్పంచ్ కొడాలి ఆశాజ్యోతి తదితరులు పాల్గొన్నారు.