ప్రపంచ ఆర్థిక సదస్సులో ‘బ్రాండ్ ఎపి’కి ప్రమోషన్

-రేపు దావోస్ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు
-WEF లో ప్రపంచ బిజినెస్ దిగ్గజాలతో సిఎం చంద్రబాబు సమావేశాలు
-కొత్త పాలసీలు, రాష్ట్ర అనుకూలతలు వివరించి పెట్టుబడిదారులకు ఆహ్వానం
-ఆదివారం రాత్రి 1.30 గంటకు ఢిల్లీ నుంచి జ్యూరిచ్ కు ముఖ్యమంత్రి బృందం
-నాలుగు రోజుల పర్యటనలో WEF సెషన్స్ లో, చర్చా కార్యక్రమాల్లో పాల్గొననున్న సిఎం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
బ్రాండ్ ఎపి ప్రమోషన్ తో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు వెళుతున్నారు. ప్రపంచ బిజినెస్ దిగ్గజాలు వచ్చే ఈ సదస్సులో భాగస్వాములు అవ్వడం ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో పెట్టుబడుల సాధనకు సిఎం చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. దేశానికి సంబంధించి పలు దిగ్గజ సంస్థలతో పాటు గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా ఇప్పటికే ఎపిలో పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం, పారిశ్రామిక దిగ్గజాలతో ఉన్న పరిచయాలు, గతంలో సాధించిన విజయాలు కారణంగా 7 నెలల కాలంలోనే పెద్ద సంఖ్యలో పెట్టుబడుల వచ్చాయి. ముఖ్యంగా పారిశ్రామిక వేత్తల్లో నమ్మకాన్ని కల్గించిన చంద్రబాబు… పెట్టుబడుల విషయంలో ఒక పాజిటివ్ వాతారణాన్ని తీసుకురాగలిగారు. దీంతో దేశంలోని ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు రూ. 4 లక్షల కోట్ల కు పైగా పెట్టుబడులపై ఒప్పందాలు జరిగాయి. వీటిలో కొన్ని ప్రాజెక్టులకు ఇప్పటికే శంకుస్థాపనలు కూడా జరిగాయి. రానున్న రోజుల్లో అర్సెల్లార్ మిత్తల్ స్టీల్ పరిశ్రమ, బిపిసిఎల్ వంటి ప్రాజెక్టుల పనులు కూడా ప్రారంభం కానున్నాయి.

జాబ్ ఫస్ట్ విధానం
ఎన్నికల్లో ప్రకటించినట్లు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల సాధన లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 20 లక్షల ఉద్యోగ, ఉపాథి కల్పన టాస్క్ ఫోర్స్ కు మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో పెట్టు బడుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల పోటీని తట్టుకుని నిలబడేందుకు ప్రభుత్వం దాదాపు 15కు పైగా కొత్త పాలసీలను ప్రకటించింది. JOB FIRST విధానంతో తెచ్చిన ఈ కొత్త పాలసీలతో పెట్టుబడుదారులను ఆకర్షిస్తోంది. ఇండస్ట్రియల్ డవల్మెంట్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, ప్రైవేటు పార్క్ పాలసీ, క్లీన్ ఎనర్జీ పాలసీ, సెమికండ్టర్ పాలసీ, డ్రోన్ పాలసీ, డాటా సెంటర్ పాలసీ,స్పోర్ట్స్ పాలసీలు, టూరిజంకు పరిశ్రమ హోదా వంటి నిర్ణయాల ద్వారా పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తోంది.
ఈ అంశాలను దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ప్రముఖంగా ప్రస్తావించి పెట్టుబ బడుల కోసం నెట్వర్క్ చేయాలనేది ముఖ్యమంత్రి ఆలోచనగా ఉంది. రాష్ట్రంలో ఉన్న మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ రాయితీలు, సమర్థవంతమైన నాయకత్వం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించడం ద్వారా జాతీయ అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేందుకు సిఎం దావోస్ పర్యటనను వేదికగా చేసుకోబోతున్నారు.

రేపు రాత్రి ఢిల్లీ నుంచి జ్యూరిచ్ కు సీఎం బృందం
ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం అమరావతి నుంచి దావోస్ ప్రర్యటనకు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలు దేరి ముందుగా ఢిల్లీ చేరుకుంటారు. డిల్లీ నుంచి అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో తన బృందంతో జ్యూరిచ్ కు చేరుకుంటారు. ముందుగా జ్యూరిచ్ లో ఉన్న ఇండియన్ అంబాసిడర్ తో భేటీ అవుతారు. అనంతరం హిల్టన్ హోటల్ లో 10 మంది పారిశ్రామిక వేత్తలతో సమావేశం అవుతారు. తరువాత అక్కడి నుంచి హోటల్ హయత్ లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో సమావేశంలో పాల్గొంటారు. మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులపై వారితో చర్చిస్తారు. ఎపిని ప్రమోట్ చేయడం, పెట్టుబడులకు వారిని ఆహ్వానించడంపై సమావేశంలో చర్చిస్తారు. అక్కడ నుంచి 4 గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి దావోస్ చేరుకుంటారు. తొలి రోజు రాత్రి పలువురు పారిశ్రామిక వేత్తలతో డిన్నర్ మీటింగ్ లో సిఎం పాల్గొంటారు. తరువాత అర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ తో ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు. తొలి రోజు సమావేశాలు ముగించుకుని హోటల్ కు చేరుకుంటారు. రెండవ రోజు సిఐఐ సెషన్ లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చలో పాల్గొంటారు. తరువాత సోలార్ ఇంపల్స్, కోకకోలా, వెల్ స్పన్, ఎల్ జి, కార్ల్స్ బర్గ్, సిస్కో, వాల్ మార్ట్ ఇంటర్ నేషనల్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ వంటి సంస్థల సీఈవోలతో, చైర్మన్ లతో రెండో రోజు ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. యుఎఈ ఎకానిమీ మినిస్టర్ అబ్దుల్లా బిన్ తో సిఎం సమావేశం అవుతారు. అనంతరం వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహిస్తున్న ఎనర్జీ ట్రాన్సిషన్ : వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ అనే అంశంపై జరిగే చర్చలో పాల్గొంటారు. అనంతరం ది నెక్ట్స్ వేవ్ పైనీరింగ్ ది బ్లూ ఎకానమీ ఆఫ్ టుమోరో అనే చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. రెండో రోజు ఈ భేటీలతో పాటు వివిధ జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థలు నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో సిఎం పాల్గొంటారు. బ్లూమ్ బర్గ్ వంటి మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా ఎపి పాలసీల గురించి వివరిస్తారు. మూడవ రోజు కూడా పలు బిజనెస్ టైకూన్ లతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రోజుకు కనీసం పదికిపైగా భేటీలు, సమావేశాల్లో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. నాలుగవ రోజు ఉదయం దావోస్ నుంచి జ్యూరిచ్ కు చేరుకుని అక్కడి నుంచి స్వదేశానికి రానున్నారు. షెడ్యూల్ మీటింగ్స్ తో పాటు… నాలుగు రోజుల సమయంలో పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో ప్రత్యేక సమావేశాల్లో ముఖ్యమంత్రి బృందం పాల్గొంటుంది. సిఎం బృందంలో పరిశ్రమల శాఖా మంత్రి టీజీ భరత్, ఐటీ మంత్రి నారా లోకేష్ తో పాటు ఇండస్ట్రీ శాఖ అధికారులు, ఇడిబి అధికారులు ఉన్నారు. 4 రోజుల దావోస్ పర్యటనలో బ్రాండ్ ఎపి ప్రమోషన్ తో పెద్దఎత్తున పెట్టుబడులకు మార్గం సుగమం చేసేందుకు సిఎం ఆలోచనలు చేస్తున్నారు. దెబ్బతిన్న బ్రాండ్ పునరుద్దరణతో మళ్లీ రాష్ట్రానికి దేశ, విదేశీ పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్రం ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. దీనికి ఈ పర్యటన దోహదం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.టి.ఆర్. జీవితం ఆదర్శనీయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నటుడుగా ఆయన స్ఫురణకు వస్తే ఆయన అభినయించిన పాత్రలే కళ్ల ముందు మెదులుతాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *