-హుదుద్, బుడమేరు వరదల సమయంలో ప్రత్యక్షంగా చూశా
-శాంతిభద్రతల రక్షణలో కేంద్ర మంత్రి అమిత్‌షా పనితీరు భేష్
-ఉగ్రవాద, నక్సల్ సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు
-కేంద్ర సాయంతో రాష్ట్రం వెంటిలేటర్ పైనుంచి బయటపడింది
-బనకచర్లకు గోదావరి నీళ్లు తీసుకెళ్లేందుకు సాయం అందించండి
-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
-ఎన్డీఆర్ఎఫ్ 20వ ఆవిర్భావ వేడుకల్లో అమిత్‌షాతో కలిసి పాల్గొన్న సీఎం
-గన్నవరంలో ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్, ఎన్ఐడీఎమ్ భవనాలు ప్రారంభం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘ఎక్కడ ఏ విపత్తు వచ్చినా మొదట గుర్తొచ్చేది ఎన్డీఆర్ఎఫ్. వరదలు, అగ్ని ప్రమాదాలు, అడవుల దహనం, భూకంపాలు వంటి విపత్తుల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ రక్షణ చర్యలతో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. దేశంలో లక్షల మంది ప్రాణాలను ఎన్డీఆర్ ఎఫ్ బలగాలు కాపాడుతున్నాయి. మన దేశంలో వచ్చిన విపత్తులతో పాటు 2011లో జపాన్, 2015లో నేపాల్, 2023లో టర్కీలో విపత్తులు వచ్చిన సమయంలో మన ఎన్డీఆర్ఎఫ్ నే సేవలందించింది. 2014లో ఉత్తరాంధ్రలో వచ్చిన హుద్‌హుద్, ఇటీవల బుడమేరు వరదల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ చేసిన సాహసోపేతమైన సేవలను ప్రత్యక్షంగా చూశాను’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కృష్ణా జిల్లా, కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ 20వ ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర హోమంత్రి అమిత్‌షాతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్, ఎన్ఐడీఎమ్ సౌత్ క్యాంపస్ భవనాలను అమిత్‌షాతో కలిసి ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. ఎన్డీఆర్ఎఫ్ ప్రాంగణం ఏపీలో ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందని, 2014లో ఆనాటి రక్షణశాఖా మంత్రి రాజనాథ్‌సింగ్ చేతుల మీదుగా ఈ ప్రాంగణానికి శంకుస్థాన చేశారని, ఎన్ఐడీఎంకు 2018లో వెంకయ్య నాయుడు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కు 50 ఎకరాలు, ఎన్ఐడీఎం ప్రాంగణం నిర్మాణానికి 10 ఎకరాల భూమి ఇచ్చామని, రెండూ పూర్తయి నేడు హోంమంత్రి అమిత్‌షా చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
అమిత్‌షా పనితీరు చూస్తే అసూయ కలుగుతుంది
‘భారతదేశంలో తిష్టవేసిన సమస్యలను పరిష్కరించేందుకు అమిత్‌షా పట్టుదలతో పని చేస్తున్నారు. శాంతిభద్రతలు కాపాడటంలో వినూత్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేకంగా డ్యాష్ బోర్డు ఏర్పాటు చేసుకుని వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నారు. నేను చాలామంది హోంమంత్రులను చూశాను కానీ… ఇలాంటి సమర్థవంతమైన మంత్రిని మొదటిసారి చూస్తున్నా. అవసరమైన సాంకేతికత వినియోగించుకోవడం, నియామకాలు చేపట్టడమొక్కటే కాకుండా విపత్తుల సమయంలో ఎలా వ్యవహరించాలో సూచిస్తున్నారు. దేశంలో ఏ మూలాన ఆపదలో ఉన్నా వారి ప్రాణాలు కాపాడాలన్న సంకల్పంతో అమితాషా ఉన్నారు. దేశంలో ఎక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలిగినా సమర్థవంతంగా పని చేసి చక్కదిద్దుతున్నారు. దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం వంటి సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు. సమర్ధతతో పని చేస్తున్న అమిత్ షా పనితీరును చూస్తే కొన్నికొన్ని సార్లు నాకు అసూయ కలుగుతుంది. మనిషిలా కాకుండా మిషన్‌లా పని చేస్తున్నారు. చాలా మంది నేతలు రిబ్బన్‌లు కట్ చేసి ప్రసంగించి వెళ్లిపోతారు. కానీ అమిత్‌షా మాత్రం ఏ అంశాన్ని తీసుకున్నా లోతుగా వివరాలు తెలుసుకుంటారు. అమిత్‌షాతో నేను ఎప్పుడు సమావేశమైనా వినూత్నమైన తన ఆలోచనలను పంచుకుంటారు. ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ చాలా విధ్వంసానికి గురైంది, ఎప్పటిలాగా కాకుండా వినూత్న ఆలోచనలతో ముందుకెళ్లాలని నాకు సలహా ఇచ్చారు. దీనికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వినూత్నంగా ఆలోచిస్తేనే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. వికసిత్ భారత్ పేరుతో 2047 విజన్‌ను ప్రధాని మోదీ విడుదల చేశారు. టెక్నాలజీపైనా ఫోకస్ పెట్టడంతో పాటు గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, స్పేస్ టెక్నాలజీ, డీప్ టెక్నాలజీ గురించి అమిత్ షా చెప్పారు. 2047 నాటికి నెంబర్ వన్ స్థానంలో మన దేశం ఉంటుంది…దీన్ని ఆపడం ఎవరి తరమూ కాదు.’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
వడ్డీలు కడుతూ అభివృద్ధిలో ముందుకెళ్తున్నాం
‘2014లో జరిగిన రాష్ట్ర విభజన, 2019లో వచ్చిన అసమర్థ ప్రభుత్వం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అయినా కేంద్రం మద్దతుతో సంక్షోభాలను సమర్ధవంతంగా ఎదుర్కొని రాష్ట్రాన్ని అగ్రపథాన నిలబెడతామన్న నమ్మకం మాలో ఉంది. ఎన్నికల సమయంలో మనమంతా చేసిన ప్రచారంతో 93 శాతం స్ట్రైక్ రేట్ వచ్చింది. ప్రజలు మనకు విజయాన్ని కట్టబెట్టారు. కానీ గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసింది. వాటికి వడ్డీలు కడుతూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. రాష్ట్రానికి కేంద్రం ఆక్సీజన్ ఇవ్వడంతో వెంటిలేటర్‌పై నుంచి బయటపడ్డాం. ఇంకా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.15 వేల కోట్లు గ్రాంటు ఇచ్చింది. పోలవరం డయాఫ్రం వాల్ పనులు కూడా శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. మీ నాయకత్వంలో ఏప్రిల్ 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజలకు చాలా సెంటిమెంట్ అంశం. విశాఖ ఉక్కు ఆంధ్రలు హక్కు నినాదంతో ప్లాంట్ ఏర్పాటైంది. గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే కేంద్రం ప్రాణం పోసింది. రూ.11,400 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఉత్తరాంధ్ర వాసులు కాంక్ష అయిన విశాఖ రైల్వేజోన్, బీపీసీఎల్‌కు ప్రధాని మోదీ ఇటీవల శంకుస్థాపన చేశారు.
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు సాయం చేయండి
‘రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు నదుల అనుసంధాన్ని చేపడుతున్నాం. గోదావరి-బనకచర్ల అనుసంధానాన్ని చేపడుతున్నాం. గోదావరి నీళ్లను బనకచర్లకు తీసుకెళ్లేందుకు విధివిధానాలు సిద్ధం చేశాం. ప్రాజెక్టును పీపీపీ విధానంలో చేపట్టేందుకు కూడా ఆలోచిస్తున్నాం. ఈ బృహత్తర కార్యక్రమానికి సాయం చేయాలని విన్నవిస్తున్నాం.’ అని సీఎం చంద్రబాబు అమిత్‌షాను వేదిక పైనుంచే కోరారు.