అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
త్వరలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన ముసాయిదా అజెండా అంశాలపై సోమవారం రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సమీక్షించారు. ప్రధానంగా రాష్ట్ర విభజన సంబంధించి వివిధ పెండింగ్ అంశాలపై జోనల్ కౌన్సిల్ సమావేశం దృష్టికి తీసుకువెళ్ళి చర్చించేందుకు వీలుగా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులతో సమీక్షించారు.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ 13లో పేర్కొన్న విశాఖపట్నృం-చెన్నె పారిశ్రామిక కారిడార్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల విస్తరణ,అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అప్ గ్రేడ్ చేయడం, అమరావతి,రాజధానితో ర్యాఫిడ్ రైల్ కనక్టవిటీ ఏర్పాటు వంటి అంశాల్లో ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధి తదపరి తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై సమీక్షించారు.అదే విధంగా ఉత్తరాంధ్ర,రాయలసీమకు చెందిన 7 వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం నుండి సాయం ఇప్పటి వరకూ అందిన సహాయం ఇంకా రావాల్సిన నిధులు అంశాలపై చర్చించారు.అంతేగాక రిసోర్సు గ్యాప్ ఫండింగ్ కింద కేంద్రం నుండి అందిన నిధులు ఇంకా అందాల్సిన నిధులపై కూడా సిఎస్ విజయానంద్ అధికారులతో చర్చించారు.
విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఢిల్లీలోని ఎపి భవన్ విభజన,వివిధ కేంద్ర విద్యా తదితర సంస్థలు ఏర్పాటు,అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం నుండి అందుతున్న సహాయం తదితర అంశాలపై సమీక్షించి పూర్తి స్థాయిలో అప్ డేటెడ్ సమాచారాన్ని అందివ్వాలని సిఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు.ఇంకా సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తాల్సిన వివిధ అంశాలపై తగిన నివేదికలు సమర్పించాలని సిఎస్ ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎస్ఆర్సి కార్యదర్శి ఎస్.బాల సుబ్రహ్మణ్యం,ఐఅండ్ఐ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్,హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్,అదనపు డిజిపి ఆర్కె మీనా,టిఆర్అండ్బి ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే,ఐజి కోఆర్డినేషన్ యం.రవి ప్రకాశ్,న్యాయ శాఖ కార్యదర్శి ప్రతిభా దేవి,విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ఆర్.కూర్మనాధ్, తదితర అధికారులు పాల్గొన్నారు.అలాగే ఎపి భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్, వ్యవసాయ,వైద్య ఆరోగ్యశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు బి.రాజశేఖర్,యం.టి.కృష్ణ బాబు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా,పౌరసరఫరాల శాఖ కమీషనర్ వీరపాండ్యన్,ఆర్థిక శాఖ కార్యదర్శి జానకి తదితరులు వర్చువల్ గా పాల్గొన్నారు.
