పాట్నా, నేటి పత్రిక ప్రజావార్త :
బీహార్ రాష్ట్రం పాట్నాలో జరుగుతున్న 85వ అఖిల భారత సభాపతుల మహాసభలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రసంగించారు. తన ప్రసంగాన్ని స్వయంగా తెలుగులో చేయడం గొప్ప ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన ప్రసంగం ద్వారా తెలుగు భాష గొప్పతనాన్ని, దాని చారిత్రక ప్రాధాన్యతను, ఆత్మగౌరవాన్ని చాటిచెప్పారు. స్పీకర్ తెలుగులో మాట్లాడటం వల్ల మహాసభలో ప్రత్యేకమైన ప్రశంసలు అందుకున్నారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను ప్రశంసిస్తూ, దేశవ్యాప్తంగా తెలుగువారి గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఆయన ప్రసంగం సాగింది.
75 ఏళ్ల ప్రజాస్వామ్య ప్రయాణం గురించి మాట్లాడుతూ, “మన రాజ్యాంగాన్ని 100 సార్లకు పైగా సవరించడం ప్రజాస్వామ్య బలానికి సూచన” అని అన్నారు. ప్రతి సవరణ మన ప్రగతికి ఎదురైన అడ్డంకులను తొలగించడానికి, రాజ్యాంగాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడిందని వివరించారు.
శాసనసభల పని దినాలు తగ్గిపోతున్న అంశాన్ని ప్రస్తావిస్తూ, “పని దినాలు తగ్గితే ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది. 100కు పైగా సభ్యులున్న చట్టసభలు ఏడాదిలో కనీసం 75 రోజులు సమావేశాలు జరపాలని” ఆయన సూచించారు. ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం కనీసం 75 రోజులు చర్చలు జరగడం అవసరమని గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో 50 శాతం మంది కొత్త సభ్యులుగా ఎన్నికయ్యారని, వారు యువ నాయకులు, తెలివితేటలతో కూడినవారని అన్నారు. అయితే, సభ నియమాలు, పద్ధతులు వారికి కొత్త కావడంతో, వారికి అవగాహన తరగతులు నిర్వహించడం ద్వారా సభా విధులు పట్ల అవగాహన పెంపొందించాలని సూచించారు.
స్పీకర్ ఈ ప్రసంగం తెలుగు భాష గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పడం ద్వారా మహాసభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.