-శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు
-జగ్గయ్యపేటలో క్రీడల అభివృద్ధిపై ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌తో చర్చ
-జాతీయపోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు శాప్ ఛైర్మన్ అభినందన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖేలో ఇండియా, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఏపీకి అత్యధిక పతకాలు సాధించి క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాలని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. జనవరి 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకూ జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని లడక్‌లో జరిగే 5వ ఎడిషన్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌లో భాగంగా ఏపీ నుంచి పాల్గొనే 20 మంది ఐస్ స్కేటింగ్ క్రీడాకారులు విజయవాడలోని శాప్ కార్యాలయంలో శాప్ ఛైర్మన్ రవినాయుడు గారిని సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ఐస్ స్కేటింగ్ కాంపిటేషన్‌కు సంబంధించి తీసుకున్న శిక్షణ, గతంలో సాధించిన విజయాల గురించి శాప్ ఛైర్మన్‌కు క్రీడాకారులు వివరించారు. ఐస్ స్కేటింగ్ క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి కల్పించాల్సిన మౌలిక వసతులు, ప్రోత్సాహకాలను అందజేస్తామని, కాంపిటేషన్‌లో అత్యధిక పతకాలు సాధించి రాష్ట్ర కీర్తిప్రతిష్టతలను దేశవ్యాప్తంగా విస్తరింపచేయాలని శాప్ ఛైర్మన్ ఆకాంక్షించారు.
జూడో క్రీడాకారులకు అభినందన..
గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గత డిసెంబర్ 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకూ జరిగిన క్యాడెట్ స్టేట్ జూడో టోర్నమెంటులో పసిడి పతకం కైవసం చేసుకున్న జూడో క్రీడాకారులు ఎన్టీఆర్ జిల్లా డీఎస్డీడీఓ అజీజ్ గారితో కలిసి శాప్ ఛైర్మన్ రవినాయుడు గారిని విజయవాడలోని శాప్ కార్యాలయంలో సోమవారం కలిశారు. మహారాష్ట్రలోని పూణేలో ఈనెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ జరిగే క్యాడెట్ బాయ్స్ అండ్ గర్ల్స్ నేషనల్ జూడో ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్నట్లు శాప్ ఛైర్మన్ కి వారు తెలియజేశారు. ఈ సందర్భంగా జూడో క్రీడాకారులను రవినాయుడు అభినందించడంతోపాటు ఏపీకి అత్యధిక పతకాలు సాధించాలని సూచించడం జరిగింది.
యోగా క్రీడాకారుడికి అభినందనలు..
యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ సింగపూర్ ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ సింగపూర్‌లో జరిగిన ఏషియన్ యోగా స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ జూనియర్స్ విభాగంలో భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించి ప్రధమస్థానం సాధించిన తాడేపల్లికి చెందిన డి.ధీరజ్ శ్రీకృష్ణ ఈరోజు విజయవాడలోని శాప్ కార్యాలయంలో శాప్ ఛైర్మన్ రవినాయుడు ని కలిశారు. ఈ సందర్భంగా ధీరజ్ శ్రీకృష్ణను శాప్ ఛైర్మన్ అభినందించి భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని సూచించడం జరిగింది.
జగ్గయ్యపేట స్టేడియంలో స్విమ్మింగ్‌పూల్ అభివృద్ధి చేయాలి..
జగ్గయ్యపేటలోని క్రికెట్ స్టేడియంలో వాటర్ లీకేజీ సమస్యలను పరిష్కరించి స్విమ్మింగ్‌పూల్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడుకి జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య), జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని శాప్ కార్యాలయంలో శాప్ ఛైర్మన్ రవినాయుడుని సోమవారం వారిరువురూ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మాట్లాడుతూ జగ్గయ్యపేటలోని స్టేడియంలో వాటర్ ట్యాంకుకు లీకేజీలు ఏర్పడి క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారన్నారు. వాటర్ ట్యాంక్, స్విమ్మింగ్‌పూల్‌ల మరమ్మతులకు చర్యలు చేపట్టాలని మున్సిపాలిటీ అధికారులను కోరగా స్టేడియం మున్సిపాలిటీ పరిధిలోకిరాదని వివరించారన్నారు. కావున క్రికెట్ స్టేడియంలో వాటర్ ట్యాంక్ లీకేజీ సమస్యను, స్విమ్మింగ్‌పూల్ మరమ్మతులకు శాప్ చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై శాప్ ఛైర్మన్ రవినాయుడు స్పందిస్తూ జగ్గయ్యపేటలోని స్విమ్మింగ్‌పూల్ అభివృద్ధికి తక్షణమే చర్యలు తీసుకోవాలని, స్విమ్మింగ్‌పూల్ మరమ్మతులకు సంబంధించి శాప్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి అంచనాలను తయారుచేసి జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పెట్టాలని ఎన్టీఆర్ జిల్లా డీస్డీడీఓను ఆదేశించారు. అలాగే జగ్గయ్యపేటలో క్రీడావసతుల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులను సమకూర్చేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌ను శాప్ ఛైర్మన్ ఆకాంక్షించారు.
జాతీయ పోటీల్లో ఏపీ సత్తా చాటాలి… : శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈనెల 28నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకూ జరిగే 38వ జాతీయ క్రీడాపోటీల్లో ఏపీ క్రీడాకారులు సత్తాచాటాలని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు ఆకాంక్షించారు. విజయవాడ గుణదలలోని ఓల్గా ఆర్చరీ అకాడమీలో ఓల్గా ఆర్చరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెరుకూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కోచింగ్ క్యాంపును శాప్ ఛైర్మన్ సోమవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా 38వ జాతీయస్థాయి పోటీల్లో ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించనున్న ఆర్చరీ క్రీడాకారులను ఆయన పరిచయం చేసుకుని అభినందనలు తెలియజేశారు. అనంతరం కృష్ణానదిలో ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ యలమంచి శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీచ్ కబడ్డీ కోచింగ్ క్యాంపును శాప్ ఛైర్మన్ ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులతో మాట్లాడుతూ జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచి ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టాలన్నారు. క్రీడాకారుల భవిష్యత్తే ధ్యేయంగా రాష్ట్రప్రభుత్వం నూతన స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చిందని, ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో స్పోర్ట్స్ కోటాను 2శాతం నుంచి 3శాతానికి పెంచిందని, క్రీడాప్రోత్సాహకాలను భారీగా పెంచిందని వివరించారు. ఏపీ నుంచి అంతర్జాతీయ క్రీడాకారులను తయారుచేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారన్నారు. దానికి అనుగుణంగా క్రీడాకారులకు ప్రయోజనకరంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడావసతులను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. క్రీడాకారుల భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో అత్యధిక పతకాలు సాధించి రాష్ట్ర కీర్తిప్రతిష్టతలను విస్తరింపజేయాల్సిన బాధ్యత క్రీడాకారులపైనే ఉందన్నారు.
గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో..
ఉత్తరాఖండ్‌లో ఈనెల 28వ తేదీ నుంచి జరిగే 38వ జాతీయ పోటీలకు సిద్ధమవుతున్న అథ్లెటిక్స్ మోడ్రన్ పెంటాథ్లన్ క్రీడాకారులను శాప్ ఛైర్మన్ రవినాయుడు గారు సోమవారం కలిసి అభినందించారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు నిర్వహిస్తున్న కోచింగ్ క్యాంపును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో ఆయన మాట్లాడుతూ 38వ జాతీయస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా, ప్రధమస్థానమే ధ్యేయంగా క్రీడాకారులు రాణించాలని సూచించారు. ఏపీకి అత్యధిక పతకాలు సాధించి దేశ వ్యాప్తంగా రాష్ట్ర కీర్తిప్రతిష్టతలను ఇనుమడింపచేయాలన్నారు. క్రీడాకారుల భవితకు రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, దానికి అనుగుణంగా క్రీడల్లో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేయాలని శాప్ ఛైర్మన్ ఆకాంక్షించారు.