-ఆరు నెలల్లోనే 3,750 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మాణం
-64 లక్షల మందికిపైగా పెన్షన్ లబ్ధిదారులతో కొత్త రికార్డు
-గాడి తప్పిన వ్యవస్థల్ని సరి చేస్తున్నాం
-20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం
– విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి \ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అభివృద్ధి, సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలోని సజ్జాపురం గ్రామంలో సోమవారం మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొత్తగా వేసిన సీసీ రోడ్లతో పాటు పలు అభివ్రుద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మరికొన్నింటికి ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం ప్రజలను వినతులు స్వీకరించి., వారి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన గత ఆరు నెలల కాలంలోనే 3,750 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు వివరించారు. ఐదేళ్ల వైసీపీ హయాంలో కేవలం 1800 కిలోమీటర్ల సీసీ రోడ్లు మాత్రమే వేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేత్రుత్వంలో రాష్ట్రంలోని గ్రామాలన్నీ కొత్త రూపును సంతరించుకుంటున్నాయని హర్షం వ్యక్తం చేశారు.
ఒక్క సంతకంతో వెయ్యి పెన్షన్ పెంపు….
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివ్రుద్ధి చేస్తూనే… సంక్షేమ పథకాల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ప్రతి నెలా 64 లక్షలకుపైగా లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తున్న రాష్ట్రం… దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు అందించే పెన్షన్ ను రూ.రెండు వేల నుంచి రూ.3 వేలకు పెంచడానికి జగన్ కు ఐదేళ్లు పట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు కేవలం ఒక్క సంతకంతో ఒకేసారి వెయ్యి పెంచి… నెలకు రూ.4 వేలు అందిస్తూ… పేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో అన్ని వ్యవస్థలూ సర్వనాశనం అయ్యాయని తెలిపిన మంత్రి గొట్టిపాటి… వాటన్నింటినీ మరలా సరి చేస్తున్నామని చెప్పారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క ఉద్యోగం కూడా పుట్టుకు రాలేదని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా ఉచిత గ్యాస్, డిఎస్సీ నోటిఫికేషన్ వంటి వాటితో పేదలకు, నిరుద్యోగులకూ లబ్ధి చేకూరేలా సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి గొట్టిపాటి వివరించారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు ఒకే సారి వెయ్యి పెన్షన్ పెంపు వంటి తాము చేస్తున్న పలు అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలను మంత్రి గొట్టిపాటి ప్రజలకు వివరిస్తూ… మీకు ఎవరు మంచి చేస్తున్నారని వారిని ప్రశ్నించిన సమయంలో… కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా… స్థానికుల నుంచి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.