Breaking News

లౌకిక రాజ్యాంగ పరిరక్షణకు నడుంకడదాం…

-మతోన్మాద రాజకీయాలను తరిమికొడదాం.
-మోదీ హయాంలో కార్పొరేట్లకే సంపద.
-రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగ పరిరక్షణే ఏకైక లక్ష్యంగా మనమంతా ప్రతిజ్ఞపూనాలని, దేశ వ్యాప్తంగా ప్రజాతంత్ర, లౌకిక శక్తులు, పార్టీలతో ఐక్యంగా ముందుకు సాగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. దేశంలో లౌకిక, ప్రజాతంత్ర వాదానికి పెనుప్రమాదం పొంచి ఉందని, అనేక ప్రమాదకర పరిస్థితులు నడుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

విజయవాడ దాసరి భవన్‌ దగ్గర సీపీఐ రాష్ట్ర సమితి అధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ జాతీయ జెండాను ఎగురవేశారు. రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఆయన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం విజయవాడ నగర సీపీఐ సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు అధ్యక్షతన జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేందుకు ప్రయత్నిస్తున్నదని, మతవాదం ప్రోద్భలంగా మెజార్టీ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి, మైనార్టీలను భయబ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. దేశంలోని ముస్లిములను రెండో శ్రేణి పౌరులుగా చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని మతోన్మాదాన్ని అంతం చేసేందుకుగాను లౌకిక, ప్రజాతంత్ర వాదులంతా ఐక్యమవ్వాలన్నారు. ఈ ఏడాదికి ఎంతో ప్రాధాన్యత ఉందనీ, 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలోనే మనం సీపీఐ శత వార్షికోత్సవాల్ని నిర్వహించుకుంటున్నామని చెప్పారు. నేడు రాజ్యాంగం దేశ వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారిందనీ, రాజ్యాంగంపై విశ్వాసంలేనివారు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను అవమానించిన వారు..కేంద్రంలో అధికారాన్ని చలాఇస్తున్నారని దుయ్యబట్టారు. వ్యవస్థలన్నీ తమ గుప్పెట్లో పెట్టుకుని ఈ రాజ్యాంగాన్ని మార్చేందుకు వారంతా వ్యవహరిస్తున్నారన్నారు. నాడు రాజ్యాంగం అమలులోకి రానప్పుడు 1949 ఆరెస్సెస్‌ సంచికలో..ఈ లౌకిక రాజ్యాంగం మాకు అవసరం లేదనీ రాశారాని గుర్తుచేశారు. మనుస్పుత్తి ఆధారంగా, హిందుమతం ఆధారంగా రాజ్యాంగం ఉండాలని ఆనాడే చెప్పారన్నారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ తమకు 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామంటూ బీజేసీ సీనియర్‌ నేత దుశ్యంత్‌ తదితరులు ప్రకటించారని గుర్తుచేశారు. అదృష్టవశాత్తూ ప్రజలు దాన్ని తిప్పికొట్టారని, బీజేపీపై ప్రజలకు విశ్వాసం చూపకుండా కేవలం 240 సీట్లకే బీజేపీని పరిమితం చేశారని, ఇవాళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం టీడీపీ, జేడీ(యూ)లాంటి లౌకిక పార్టీలపైనే ఆధారపడి కేంద్రంలో అధికారంలో ఉన్నందునే కాస్త రాజ్యాంగం కొనసాగుతోందని చెప్పారు. లేకుంటే డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రచించిన ఈ రాజ్యాంగాన్ని మార్చేసేవారని, కొత్త రాజ్యాంగం కోసం కమిటీలు వేసేవారని, దాన్ని అమలులోకి తెచ్చేవారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో సోషలిస్ట్‌, సెక్యులరిజం అనే పాదాలను తొలగించాలంటూ బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. అదృష్టవశాత్తూ సుప్రీం ధర్మాసనం అవి కొనసాగాలంటూ స్పష్టంగా తీర్పునివ్వడంతో రెండో ప్రమాదం తప్పిపోయిందన్నారు. ఏదైతే రాజ్యాంగంలో ప్రియాంబుల్‌ (ప్రవేశిక) అనే పదం ఉందో..దానికే నేడు ప్రమాదం వచ్చి పడిరదన్నారు. ఆచరణలో జరిగిందేమిటంటే..75 ఏళ్లుగా దేశంలో కోటేశ్వర్లు..మరింతగా ఎదిగారని, కార్పొరేట్ల ఆస్తులు విపరీతంగా పెరిగిపోయాయని, పేదవాడు పేదవాడుగానే పరిమితమయ్యాయని వివరించారు. ప్రపంచంలోనే ధనవంతులుగా కార్పొరేట్‌ వర్గాలు ఎదిగిపోయేందుకుగాను దేశానికి 75 ఏళ్లుగా పాలించిన పాలకులే కొమ్ముకాశారన్నారు. ఇంకా 30 నుంచి 40 శాతం మంది దళితులు, పేదలు దారిద్య్రంలో ఉన్నారంటే.. ఈ దేశాన్ని పాలించిన పరిపాలకుల విధానాలే కారణమని విమర్శించారు. అంబానీ, అదానీల అవినీతి కార్యకలాపాలకు కేంద్రంలోని పాలకుల అండదండలుగా నిలుస్తున్నారన్నారు. సాక్ష్యాత్తూ పార్లమెంట్‌లో దేశ హోంమంత్రి అమిత్‌షా.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను అవమానించిన సంఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయని, సీపీఐ పక్షాన తీవ్రంగా ఖండించామని గుర్తుచేశారు. సీపీఐ కర్తవ్యంగా రాజ్యాంగాన్ని మనం పరిరక్షించాలని, లౌకిక వాదాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.

మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ మాట్లాడుతూ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రంచించిన రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చినప్పటికీ.. దాని అమలులో అనేక అవరోధాలు ఎదురవుతున్నాయని చెప్పారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ.. నేడు అది ప్రమాదంలో పడిందన్నారు. పాలకులు దాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఒకే దేశం, ఒకే భాషా తదితర నినాదాలతో కేంద్రంలోని పాలకులు వ్యవహరిస్తున్నారని తూర్పారబట్టారు. లౌకికవాద దేశంలో పెద్ద ప్రమాదం పొంచి ఉందన్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో..జమిలీ ఎన్నికలతోనే ఈ దేశానికి సుస్థిరిత వస్తుందని చెప్పడం దురదృష్టకరమన్నారు. అసలు జమిలీ ఎన్నికలపై పార్లమెంట్‌లో ఆమోదానికి నోచుకోలేదని, అయినా ఆమె రాజకీయ ప్రసంగం చేయడం తగదన్నారు. ఈ రాజ్యంగం పరిరక్షణ కోసం మనమంతా ఐక్యంగా ముందుకు సాగాలన్నారు.

పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ మాట్లాడుతూ, వివక్షలేని సమాజం కోసం ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం అమలులో అనేక అవరోధాలు ఎదురవుతున్నాయన్నారు. పాలకపక్షాల విధానాల కారణంగా రాజ్యాంగంలో పేర్కొన్న ఏ ఒక్క అంశమూ అమలులోకి రావడంలేదని చెప్పారు. రాజ్యాంగంలో పేర్కొన్న అంశాల ఆధారంగా ఆర్థిక అసమానతలు లేని దిశగా ఈ సమాజం అభివృద్ధి చెందాల్సిన అవసరముందని, నేడు దానికి విరుద్ధంగా కొనసాగుతోందన్నారు. సంపద కొద్ది మంది చేతుల్లోకి వెళ్లిపోయిందని, ప్రధానంగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక అది మరింతగా పెరిగిపోయిందని విమర్శించారు.

తొలుత ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు పి.చంద్రానాయక్‌, కోశాధికారి ఆర్‌.పిచ్చయ్య, నజీర్‌ తదితరుల నేతృత్వంలో అభ్యుదయ, దేశభక్తి గీతాలను ఆలపించారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్‌, రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు సిహెచ్‌.కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవానీ, చేతివృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర నాయకులు కె.రామాంజనేయులు, పార్టీ నాయకులు వై.చెంచయ్య, జాన్సన్‌బాబు, పార్టీ రాష్ట్ర, నగర నేతలు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. సమావేశానికి సీపీఐ నగర సహాయ కార్యదర్శి లంక దుర్గారావు వందన సమర్పణ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పిజిఆర్ఎస్ ఆర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కారానికి చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *