జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులు, డ్వాక్రా మహిళలు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందజేస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారు కోరారు. బుధవారం జగ్గయ్యపేట పట్టణ సమీపంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్ లో కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వారి సహకారంతో కృష్ణా ఫార్మర్స్ సర్వీసెస్ కో అపరేటివ్ సొసైటీ, జగ్గయ్యపేట మండలంలోని బండిపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కౌలు రైతులు, డ్వాక్రా మహిళలకు రూ. 1.60 కోట్ల రూపాయల రుణాల మంజూరు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం నూతనంగా జగ్గయ్యపేట కృష్ణా ఫార్మర్స్ సర్వీసెస్ కో అపరేటివ్ సొసైటీ చైర్మన్ గా ఎన్నికైన జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి గ్రామానికి చెందిన తుమాటి నాగేశ్వరరావు ను ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పూలమాలలు, శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావుని జగ్గయ్యపేట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల అధ్యక్షులు, వైఎస్ఆర్ సీపీ నాయకులు పూలమాలలు, శాలువతో ఘనంగా సత్కరించారు.
