-జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు చేసిన త్యాగం మరువలేనిదని జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని మీటింగ్ హాల్ నందు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… అమరజీవి పొట్టి శ్రీరాములు ఒక గొప్ప త్యాగ మూర్తి అని, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆద్యుడని కొనియాడారు. ఆయన 1901 మార్చి 16 న జన్మించి 1952 డిసెంబరు 15న అమరులయ్యారన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి, అమరజీవియైన మహాపురుషుడన్నారు. 1956 నవంబర్ 1న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందన్నారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడన్నారు. ఇటువంటి మహనీయుని జయంతి సందర్భంగా ఆయన ఆదర్శాలను మనం అందరం అనుసరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి దేవేంద్ర రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ మరియు సాధికార అధికారిని జ్యోత్స్న, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.