-సుజనా అకాడమీ తో ఎస్ వి హెచ్ ఇంజనీరింగ్ కళాశాల విలీనం…
-ఈ నెల 15 న ఉభయ యాజమాన్యాల ఒప్పందం…
-యలమంచిలి జనార్దన రావు- దైతా మధుసూదన శాస్త్రి ఇంజనీరింగ్ కళాశాల గా నూతన ఆవిర్భావం…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మెరుగైన ఉన్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యను అందించడానికి 45 ఏళ్ల చరిత్ర గల ఎస్ వి హెచ్ ఇంజనీరింగ్ కళాశాల పునరంకితం కాబోతుంది. ఇందుకోసం సుజనా అకాడమీ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (సాట్స్) తో
డి ఎం ఎస్ ఎస్ వి హెచ్ ఇంజనీరింగ్ కాలేజీ విలీనం కాబోతోంది. ఈ మేరకు ఉభయ యాజమాన్యాలు ఈనెల 15న ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ఈ విలీనం అనంతరం యలమంచిలి జనార్దన రావు దైతా మధుసూధన శాస్త్రి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పేరుతో మరింత ఉన్నత ప్రమాణాలతో సరికొత్తగా ఈ ఇంజనీరింగ్ కళాశాల కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో అందుబాటులోకి రాబోతుంది.
కే జీ నుండి పిజీ కోర్సులు అందించిన ఘనత…
కేజీనుండి పీజీ కోర్సులు విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చిన ఘనత హిందూ విద్యాసంస్థలు సొంతం చేసుకున్నాయి. 1856 లో స్థాపించబడిన ది హిందూ హై & బ్రాంచ్ స్కూల్స్ సొసైటీ దశాబ్దాలుగా విలువలతో కూడిన విద్యను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంది. కేజీ నుండి పిజీ వరకు వివిధ కోర్సులను అందించిన ఘనతను సొంతం చేసుకుంది.తద్వారా ఈ సొసైటీ ఎప్పటికప్పుడు తన విద్యా ఆవిష్కరణలను విస్తరిస్తూ వచ్చింది.
1980-81 లో అనగా 45 సంవత్సరాల క్రితం ప్రముఖ న్యాయవాది ,విద్యావేత్త అయిన దివంగత శ్రీ దైతా మధుసూదన శాస్త్రి గారు హిందూ సొసైటీ ఆధ్వర్యంలోని ప్రముఖ సంస్థ- దైతా మధుసూదన శాస్త్రి శ్రీ వెంకటేశ్వర హిందూ (డిఎంఎస్ ఎస్‌విహెచ్) కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్థాపించబడింది. మచిలీపట్నంలోని (పోతిరెడ్డిపాలెం) బీచ్ రోడ్ లో ఈ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ కళాశాల కాకినాడలో JNTUK తో అనుబంధంగా వుండి AICTE తో ఆమోదించబడి, ISO ధృవీకరణ కలిగి వుంది.
అరుదైన కళాశాల….
ఆంధ్ర రాష్ట్రంలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఇంజనీరింగ్ సంస్థలలో ఒకటైన ఈ కళాశాల ప్రారంభమైనప్పటి నుండి అధిక నాణ్యత గల సాంకేతిక విద్యను అందిస్తోంది. 1980 దశకంలో ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పిన అతికొద్ది (దాదాపు 13 కళాశాలలు) ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఒకటైన ఈ సంస్థ అద్భుతమైన ప్రమాణాల్ని కలిగి ఉంది. ఈ కళాశాల పూర్వ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వ్యాపింపబడి అత్యంత ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు.
సుజనా అకాడమీ తో కలిసి పునరంకితం…
సాంకేతిక విద్య విధానాల్లో విప్లవాత్మక మార్పులతో ప్రగతి సాధిస్తున్న ఈ సంస్థను మరింత ఉన్నత స్థాయికు తీసుకెళ్లే గొప్ప ఉద్దేశ్యంతో హిందూ సొసైటీ వారు DMS SVH కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ను సుజనా అకాడమీ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (SATS) లో విలీనం చేయడానికి సంకల్పించారు. సుజనా ఫౌండేషన్ సాంకేతిక మరియు వైద్య , విద్యా రంగంలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నత విద్యను అందిస్తున్న పేరొందిన అకాడమీ గా గుర్తింపు పొందింది. సుదీర్ఘ అనుభవంతో నిబద్ధత కలిగిన సంస్థగా గుర్తింపు కలిగి వుంది. ఈ సంస్థ యువతకు మరింత చేరువయ్యే కార్యక్రమాలలో భాగంగా సుజనా ఫౌండేషన్ ,విజయ దీపం, సుజన్ మిత్ర, విద్యాన్నపూర్ణ మొదలైన విద్య మరియు ఉపాధి ప్రాజెక్టుల అభివృద్ధి మరియు అమలులో చురుకుగా పాల్గొంటున్నది. వీటిని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్కీమ్స్ అండ్ పాలసీస్ (CRISP) మరియు విద్యా శాఖ, AP ప్రభుత్వం యొక్క SEEDS వంటి వివిధ ప్రభుత్వ సంస్థల సహకారంతో నిర్వహిస్తొంది. ఇంతటి నెట్ వర్క్ వున్న సుజనా అకాడమీలో ఎస్ వి హెచ్ ఇంజనీరింగ్ కళాశాల విలీనం కావడం శుభపరిణామమే .
ఇకపై ఈ కళాశాల “యలమంచిలి జనార్ధన రావు –
దైతా మాధుసూదన శాస్త్రి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్” అను కొత్త పేరుతో ఆవిర్భవించి విజయవంతంగా ముందుకు సాగనుంది.
రేపు విలీన ఒప్పందం…
దైతా మధుసూదన శాస్త్రి ఎస్ వి హెచ్ ఇంజనీరింగ్ కళాశాలను సుజనా అకాడమీలో విలీన ఒప్పంద కార్యక్రమం ఈనెల 15 మంగళవారం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గనులు ,ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ,విశిష్ట అతిథిగా మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాల శౌరి, గౌరవ అతిథిగా విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా గ్రూప్స్ చైర్మన్ మాజీ కేంద్రమంత్రి వై యస్ చౌదరి పాల్గొననున్నారు. వీరితోపాటు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ,పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ,పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ,గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము ముడా చైర్మన్ మట్టా ప్రసాద్ అలాగే హిందూ హై అండ్ బ్రాంచ్ స్కూల్స్ సొసైటీ సెక్రటరీ డి జి శాస్త్రి, సుజనా అకాడమీ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (సాట్స్) ప్రెసిడెంట్ పి వి రావు హాజరవుతారు .మచిలీపట్నం పరిధిలోని పోతిరెడ్డి పాలెం గ్రామంలో (బీచ్ రోడ్డు) గల కళాశాల ప్రాంగణంలో మంగళవారం ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని హిందూ హై అండ్ బ్రాంచి స్కూల్స్ సొసైటీ ప్రెసిడెంట్ కొనకళ్ళ నారాయణ రావు తెలిపారు.