-మంత్రి నాదెండ్ల మనోహర్
-ప్రతి రేషన్ డిపో వద్ద QR కోడ్ పోస్టర్లు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయం నుంచి విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ప్రతి రేషన్ డిపో వద్ద QR కోడ్ పోస్టర్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
రేషన్ కార్డుదారులు ఆ QR కోడ్‌ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలు, ఫిర్యాదులు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. అందుకోసం ఏర్పాటు చేసిన వెబ్ ఫారమ్‌లో సరైన వివరాలు నమోదు చేయగలరని సూచించారు.
ఈ ఫారమ్‌లో పౌరులు ఇచ్చే అభిప్రాయాలు:
ఈ నెల రేషన్ తీసుకున్నారా?
సరుకుల నాణ్యతపై సంతృప్తిగా ఉన్నారా?
సరైన తూకంతో సరఫరా చేశారా?
డీలర్ మర్యాదగా వ్యవహరించాడా?
ఎటువంటి అధిక ధరలు వసూలు చేశారా?
ఇలాంటి ప్రశ్నలకు “అవును / కాదు” అని సమాధానాలు ఇచ్చే విధంగా ఉంటుంది. పౌరుల నుంచి వచ్చిన స్పందనలు నేరుగా ఉన్నతాధికారులకు చేరి, అవసరమైనచోట్ల చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
ప్రజల భాగస్వామ్యం ద్వారా సేవల్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో ఈ విధానం అమలు చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
“ఇంటింటా రేషన్ పేరిట మొబైల్ యూనిట్లతో పంపిణీ కన్నా ప్రస్తుతం డిపోల వ్యవస్థలో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి.
నేటి నుంచి 65 సంవత్సరముల పైబడిన వృద్ధులు, దివ్యాంగుల కోసం 5 రోజుల ముందే ఇంటికే రేషన్ సరఫరా చేసే విధానం ప్రారంభమైందన్నారు. జులై రేషన్‌ను జూన్ 26వ తేదీ నుంచే పంపిణీకి చేస్తున్నట్లు వివరించారు.
“ప్రజల అభిప్రాయాలే మార్గదర్శకంగా మారే ఈ వ్యవస్థలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి” అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News