Breaking News

మిషన్ వాత్సల్య – పీఎంకేర్ పథకం కింద దేశంలోనే తూర్పు గోదావరి జిల్లాలో మొదటి చెక్కు అందజేత

-చిన్నారుల సంక్షేమ కార్యక్రమాలన్నీ మిషన్ వాత్సల్య పరిధిలోకి
-రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశం లోనే మొట్టమొదటి మిషన్ వాత్సల్య – పీఎం కేర్ చెక్కును తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సుమా మణికీ అంద జేస్తున్నట్లు రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలియజేశారు.

శుక్రవారం ఉదయం స్థానిక పోలీసు కల్యాణ మండపంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శాసన పరిషత్ సభ్యులు సోము వీర్రాజు, రాజమండ్రి పట్టణ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి గ్రామీణ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరిలతో కలిసి కొవ్వూరు మండలం దొమ్మేరు కు చెందిన సుమ మణికి చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ … “మానవ సేవే మాధవ సేవ” అనే సూక్తికి ఈ కార్యక్రమమే ఉదాహరణ అని చెప్పారు. దేహం దేవాలయం అయితే, అందులోని జీవుడే నారాయణుడని స్కాంద పురాణం పేర్కొంటోందని అన్నారు. దేశంలో కోవిడ్ కారణంగా 15 కోట్ల మంది మృతి చెందుతారని, దీనికి కారణం పరిశుభ్రతపై భారతీయులు శ్రద్ధ వహించక పోవడమేనని ఒక అంతర్జాతీయ సంస్థ నివేదిక ఇచ్చినట్లు చెప్పారు.కానీ నరేంద్ర మోది చేపట్టిన స్వచ్ఛభారత్, ఇతర పటిష్ట విధానాల వల్ల కోవిడ్ మరణాలను గణనీయంగా తగ్గించగలిగామని చెప్పారు. దేశంలో వ్యాక్సిన్లు తయారీకి కూడా భారత ప్రభుత్వం మద్దతు ఇచ్చిందని చెప్పారు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన పిల్లలను వారి బంధువులు సైతం ఆదరించలేదన్నారు. ఆ సమయంలో ప్రధాని అండగా నిలిచారని, వారి కోసం పీఎం కేర్ పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. ప్రధాని చైర్ పర్సన్ గా, కేంద్ర ఆర్థిక, రక్షణ, హోమ్ శాఖ మంత్రులతో పాటు పారిశ్రామికవేత్తలు సభ్యులుగా ఉండే పిఎం కేర్ కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసిందని చెప్పారు. 10 లక్షల రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి లబ్ధిదారుకు 23 సంవత్సరాలు నిండిన తర్వాత అందజేయటం ఈ పధకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. అందులో భాగంగా దేశంలో మొదటి చెక్కును ప్రత్తిపాటి సునియా సుమ మణికి అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ ఆర్థిక సహాయాన్ని తన కుమార్తె భవిష్యత్తుకు వినియోగిస్తానన్న సుమమణిని, ఆమె భర్తను ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు.

కార్యక్రమంలో పాల్గొన్న శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ…. పి ఎం కేర్ పథకం చాలా గొప్ప పథకం అని, ఈ పథకం ప్రవేశ పెట్టిన సందర్భంలో ఆనాడు తెలియకపోవచ్చని, కానీ నేడు అది లబ్ధిదారుకు ఎంతగా ఉపయోగ పడుతుందో అన్న విషయం నేడు అర్థమవుతోందని చెప్పారు. ఇది ప్రధాని దూర దృష్టికి సంకేతమని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోది ఆలోచన వలన సుమ మణి వంటి ఎందరో వ్యక్తులకి న్యాయం జరిగినట్లు చెప్పారు. కోవిడ్ క్లిష్ట సమయంలో కూడా ఏఎన్ఎంలు సేవలందించారని ప్రశంసించారు. గత ప్రభుత్వం కోవిడ్ మరణాలపై సరైన లెక్కలు చెప్పలేదని విమర్శించారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ… పిఎం కేర్ ద్వారా దేశంలోనే మొదటి చెక్కును అంద జేయటం అభినందనీయమన్నారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాల వల్ల ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ ఇంగ్లాండ్ ను అధిగమించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు.

కార్యక్రమంలో పాల్గొన్న గ్రామీణ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ… కోవిడ్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వంతో పాటు ప్రజల బాధ్యతతో వ్యవహరించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం 3500 ల అంగన్వాడి కేంద్రాలను అప్ గ్రేడ్ చేసిందని, ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్నం భోజనం అమలు చేస్తోందని చెప్పారు. పార్లమెంట్ ఆమోదించిన మహిళా బిల్లులలో రానున్న రోజుల్లో చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగనుందని చెప్పారు.

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ… తల్లిదండ్రులను కోల్పోయిన సుమారాణికి నెల నెల 4000 రూపాయల ఆర్థిక సాయం అందజేసినట్లు చెప్పారు. గతంలో వివిధ విభాగాల కింద ఉన్న స్వగృహ హోమ్స్, శిశు గృహాలు, విద్యా, సంక్షేమ సదుపాయాలు, జువెనైల్ జస్టిస్ వంటి కార్యక్రమాలన్నింటినీ మిషన్ వాత్సల్య కిందకు తెచ్చినట్లు చెప్పారు. తద్వారా చిన్నారుల సంక్షేమం మరింత మెరుగ్గా చేపట్టే అవకాశం కలిగిందన్నారు. తనకు అందుతున్న ఆర్థిక సహాయాన్ని తన కుమార్తె సంక్షేమానికి వినియోగిస్తానన్న సుమారాణిని అభినందించారు.

లబ్ధిదారు సుమా రాణి మాట్లాడుతూ… తల్లిదండ్రులు లేని లోటును ప్రభుత్వం తీర్చిందని చెప్పారు. ఏడవ తరగతిలోనే తండ్రిని కోల్పోయానని, కరోనా రెండవ విడతలో (సెకండ్ వేవ్) లో తల్లిని కోల్పోయి నట్లు చెప్పారు. తనను చూసేవారు ఉన్నా, చదివించే వారు లేరని పేర్కొన్నారు. కానీ పీఎం కేర్ ద్వారా తాను చదువు కొనసాగించి నర్సింగ్ పూర్తి చేయగలిగానని చెప్పారు.

కార్యక్రమం చివరిలో ఒకటవ తరగతిలో చేరబోతున్న చిన్నారులకు “గ్రాడ్యుయేషన్ డే” నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి సిహెచ్. శ్రీలక్ష్మి, అర్బన్ సిడిపిఓ నరసమ్మ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, ఏఎన్ఎం లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *