-ఈ నెల 5 న నిర్వహించే రెండవ జాతీయ లోక్ అథాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి
-రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ బి.ఎస్.వి.హిమబిందు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలనే లక్ష్యంతో సుప్రీం కోర్టు మీడియేషన్ మరియు కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ ఈ నెల 1 వ తేదీ నుండి 90 రోజుల పాటు నిర్వహిస్తున్న దేశవ్యాప్త మధ్యవర్తిత్వ క్యాంఫైన్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యారు సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ (డిస్ట్రిక్టు అండ్ సెషన్స్ జడ్జి) బి.ఎస్.వి.హిమబిందు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా సివిల్ కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు మరియు ప్రీ-లిటిగేషన్ కేసులను పరిష్కరించేందుకు ఈ నెల 5 వ తేదీన నిర్వహించే 2 వ జాతీయ లోక్ అథాలత్ ను కూడా సద్వినియోగం చేసుకోవాలన ఆమె కోరారు. బుధవారం రాష్ట్ర సచివాలయం దగ్గర్లోనున్న రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ మీడియేషన్ ఫర్ ద నేషన్ క్యాంఫైన్ మరియు లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీచేసుకుంటే ఇరు పక్షాలు విజయం సాధించినట్లే అన్నారు.
మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరించుకునేందుకు ఈ నెల 1 వ తేదీ నుండి సెప్టెంబర్ 30 వ తేదీ వరకు 90 రోజులపాటు దేశవ్యాప్తంగా మీడియేషన్ ఫర్ ద నేషన్ క్యాంఫైన్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెలలో పరిష్కరించ దగ్గ కేసులను గుర్తించి, మధ్యవర్తిత్వం ద్వారా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందుకై మధ్యవర్తిత్వంలో శిక్షణ పొందిన దాదాపు 893 మంది విశ్రాంత న్యాయమూర్తులు, సమాజ సేవకులు మరియు న్యాయవాదులకు ఆయా కేసులను అప్పగించి, వారి మధ్యవర్తిత్వంలో పరిష్కారమైన కేసులకు కోర్టులో రాజీ మార్గంలో తీర్పు ఇవ్వడం జరుగుతుందన్నారు. సాధారణంగా ఏ కోర్టులో అయినా తీర్పు చెపితే, ఎవరో ఒకరు మాత్రమే విజయం సాధించే అవకాశం ఉంటుందని, దాని పైన అప్పీళ్లకు కూడా వెళ్ళే అవకాశం వుందని ఆమె తెలిపారు. అలా కాకుండా మధ్యవర్తిత్వం ద్వారా కానీ లేదా లోక్ అదాలత్ ద్వారా గాని పరిష్కరించుకున్నట్లైతే, కక్షిదారులు ఇరువురూ విజయం సాధిస్తారన్నారు.
అదే విధంగా, జాతీయ న్యాయసేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు ఏడాదికి 3 నుండి 4 జాతీయ లోక్ అథాలత్ లను నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 5 వ తేదీన 2వ జాతీయ లోక్ అథాలత్ ను రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లోనూ, హైకోర్టులోనూ మరియు విశాఖపట్నంలోని డెట్ రికవరీ ట్రిబ్యునల్ లోనూ ఈ అథాలత్ లను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ అథాలత్ తో వివాహ, ఆస్తి, సివిల్ తగాదాలు, మనీ సూట్లు, వాహన ప్రమాదాల ఇన్సూరెన్స్ కేసులు. చెక్ బౌన్స్ కేసులు మరియు రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులను కూడా రాజీ చేసుకోవచ్చని ఆమె వివరించారు. హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ, 13 డిఎల్‌ఎస్ఏ లు మరియు 147 ఎంఎల్ఎస్ఏ లు గత కొద్ది కాలంగా కృషి చేసి లోక్ అదాలత్ లో రాజీపడ దగ్గ కేసులు మొత్తం 1,15,071 రాష్ట్రంలో ఉన్నట్లు గుర్తించడం జరిగిందని ఆమె తెలిపారు. లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకోవడం వల్ల కక్షిదారుల సమయం డబ్బు కూడా ఆదా అవుతుందని, మానవ సంబంధాలు మెరుగుపడతాయని ఆమె వివరించారు. కక్షలు కార్పణ్యాలకు పోకుండా లోక్ అథాలత్ లో రాజీపడడటమే రాజమార్గమనే విషయాన్ని కక్షిదారులు అందరూ గుర్తించాలన ఆమె విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఉప కార్యదర్శి డాక్టర్ హెచ్.అమర రంగేశ్వర రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్యాటర్న్ ఇన్ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ రవీనాథ్ తిలహరి మార్గదర్శకత్వంలో వారి సూచనల మేరకు జాతీయ లోక్ అథాలత్ ను నిర్వహించడం జరుగుతుందన్నారు. సహాయ కార్యదర్శి ఎన్. జే.రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News