ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అశ్రద్ధ చూపవద్దు… : కలెక్టర్ జె.నివాస్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులపై జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందన కార్యక్రమానికి హాజరుకాని అధికారులందరికీ వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయమని అధికారులను ఆయన ఆదేశించారు.
సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ప్రజాస్పందన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులతో నిర్వహించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అశ్రద్ధ చూపవద్దని ఆయన ఈ సందర్భంగా సూచించారు. జిల్లాలోని అసంఘటిత కార్మికుల వివరాలను సేకరించాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. వలస కార్మికులు, అంగన్ వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఉపాధిహామీ పథకం కార్మికులు, పాల వ్యాపారాలు, చిరువ్యాపారులు చేసే వారి వివరాల సైతం సేకరించాలన్నారు. జాతీయ కార్మిక కమీషనర్ ఆదేశాల మేరకు వివరాలన్నింటిని జిల్లాలోని కార్మికశాఖ అధికారులకు అప్పగించాలన్నారు. ఆ తరువాత బుధవారం జరిగే జిల్లా సమీక్షా మండలి సమావేశానికి అధికారులు పూర్తి వివరాలతో సిద్ధం కావాలన్నారు. కోవిడ్ మహమ్మారి మూడవదశ వ్యాపిస్తుందన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో తీసుకుంటున్న జాగ్రత్తలపై పీపీటీ తయారు చేయమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి ఎం.సుహాసినిని ఆదేశించారు. అలాగే ఫీవర్ సర్వే, వ్యాక్సిన్ల పై వివరాలను ఇవ్వాలని కలెక్టర్ చెప్పారు. ఉపాధిహామీ పథకం కింద నిర్మించిన సిసి రోడ్ల పెండింగ్ పనులను, సిమెంట్ కంపెనీలతో గృహనిర్మాణం కోసం ఒప్పందం చేసుకున్న వివరాలను సమావేశం దృష్టికి తీసుకువెళ్లాలని డ్వామా పీడి సూర్య నారాయణకు సూచించారు. నాడు-నేడు పథకంలో భాగంగా జిల్లాలో మొదటి విడత కింద పూర్తి చేసిన వివరాలు, అంగన్‌వాడీ నియామకాలు, రైతు స్పందనలో వచ్చిన సమస్యలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు తదితర వాటిని కూడా జత చేయమని కలెక్టర్ ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ జ్వరాలు ప్రబలుతున్న దృష్ట్యా జిల్లాలో ఉన్న 30 ప్రత్యేక ల్యాబ్స్ ద్వారా వెనువెంటనే టెస్టింగ్ చేయించమని జె.నివాస్ పేర్కొన్నారు. మండలంలోని మలేరియా అధికారులందరూ గ్రామాల్లో సమావేశాలు పెట్టి ప్రజలను చైతన్య పరచాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.

స్పందనలో వచ్చిన అర్జీలు…
కృత్తివెన్ను మండలం మాట్లం గ్రామానికి చెందిన మోకా మీరాసాబ్ కలెక్టర్ కు అర్జీ సమర్పించారు. తన స్థలంలో సర్వే చేసి హద్దులు నిర్ధారించాలని, ఈ కారణంగా పలువురితో తగాదాలు జరుగుతున్నాయని కలెక్టర్ వద్ద ఆయన వాపోయారు.
ముసునూరు గ్రామానికి చెందిన ఎం.భాస్కరరావు ఒక అర్జీని కలెక్టర్ కు అందజేశారు. కోర్టు జారీచేసిన ఉత్తర్వులను కలెక్టర్ కు అందజేశారు. ఆ మేరకు తనకు రావలసిన 1.21 సెంట్ల భూమిని సర్వే చేసి హద్దులు ఏర్పరచాలని కలెక్టర్ ను అభ్యర్థించారు.
తిరువూరు మండలం వామగుంట గ్రామానికి చెందిన కొందరు దళితులు కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు. తాము సాగుచేసుకుంటున్న భూమిని సర్వే చేయించి పట్టాను ఇవ్వాలని కలెక్టర్ వద్ద మొర పెట్టుకున్నారు.
తరకటూరు గ్రామానికి చెందిన గుర్రం చాతుర్య (రెండు సంవత్సరాలు) గుండె కవాటానికి రంద్రం ఏర్పడటంతో పాప ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తల్లిదండ్రులు కలెక్టర్ కు మొర పెట్టుకున్నారు. ఈ విషయమై స్పందించిన కలెక్టర్ జె.నివాస్ వారితో మాట్లాడుతూ పాప గుండె శస్త్రచికిత్స కు అయ్యే ఖర్చును ముఖ్యమంత్రి సహానిధి నుంచి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
బాపులపాడు మండలం కోడూరుపాడు గ్రామానికి చెందిన బెజ్జంకి శివశంకర్ తన కుమార్తె సీతామహాలక్ష్మి చనిపోయిందని ఆమెకు అప్పటికి 5 రోజుల కుమారుడు ఉన్నాడని ఆమె కోడూరుపాడు సచివాలయంలో మహళా సంక్షేమ కార్యదర్శిగా పనిచే సేదని ఆ కుటుంబానికి ఎటువంటి ఆధారం లేకపోవడం వల్ల తన అల్లుడికి ఉద్యోగం కల్పించాలని కలెక్టర్ ను శివశంకర్ అభ్యర్థించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు డా. కె.మాధవీలత, కె.మోహన్ కుమార్ నూపూర్ అజయ్ కుమార్ అసిస్టెంట్ కలెక్టర్ శోభిత, ఆర్డీఓ ఖాజావలి తదితరులు హాజరైయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *