-డిసెంబర్ 31 వరకూ భూ విభజనకు అవకాశం
-రూ.500 విభజన రుసుము మాఫీ
-రూ.50 నామమాత్రపు రుసుముతో సేవలు
-జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలో రీ-సర్వే పూర్తైన గ్రామాలలో వెబ్ ల్యాండ్ 2.0లో జాయింట్ పట్టాదారులుగా నమోదైన భూ యజమానులు, తమ భూములను వ్యక్తిగతంగా విభజించుకునేందుకు 2025 డిసెంబర్ 31వ తేదీ వరకు అవకాశం కల్పించబడిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో భూ విభజన కోసం సాధారణంగా వసూలు చేసే రు.500 ప్రభుత్వ రుసుమును పూర్తిగా మాఫీ చేయబడినదీగా తెలిపారు. భూ యజమానులు కేవలం రు.50 నామమాత్రపు దరఖాస్తు రుసుమును గ్రామ సచివాలయంలో చెల్లించి, డిసెంబర్ 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈ ప్రత్యేక అవకాశం ద్వారా జాయింట్ పట్టాదారులు తమ భూములను విడిగా నమోదు చేసుకొని, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అర్హతను పొందవచ్చని జాయింట్ కలెక్టర్ తెలియ చేశారు. ఇప్పటికే ఆ పథకాల అమలులో జాయింట్ పట్టాల వల్ల అర్హత రాని వ్యవసాయదారులు, ఈ అవకాశాన్ని వినియోగించు కుంటే వారికి ప్రయోజనం జరుగుతుందని పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇబ్బంది ఎదురవుతున్న రైతులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేస్తే వారికి తొలి ప్రాధాన్యతనిస్తూ పరిష్కారం కల్పిస్తామని ఆయన తెలియజేశారు.
Prajavartha Online Telugu News