శ్రీశైలం, నేటి పత్రిక ప్రజావార్త :
మంత్రి గుమ్మిడి సంధ్యారాణి బుధవారం శ్రీశైలం లో “గిరిజన బహుళ ప్రయోజన మార్కెటింగ్ కేంద్రం” (Trible Multipurpose Marketing Center – T.M.M.C) భవనం నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. ఈ భవనం నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.100 లక్షల నిధులను కేటాయించింది. నిర్మాణానికి కావలసిన నిధులు డీఏ–జగ్వే ద్వారా సమకూర్చబడ్డాయి. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజాశేఖర రెడ్డి మరియు ఎమ్మెల్యే జయ సూర్య పాల్గొని… గిరిజనుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు.
ఈ సందర్భంగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ… “గిరిజన బహుళ ప్రయోజన మార్కెటింగ్ కేంద్రం” గిరిజన సమాజానికి ఒక పెద్ద వరమవుతుంది. ఈ కేంద్రం పూర్తవుతే.. శ్రీశైలం మరియు పరిసర ప్రాంతాల గిరిజన సమాజానికి సామాజిక–ఆర్థిక అభివృద్ధిలో కొత్త దిశ లభిస్తుంది. గిరిజనులు ఉత్పత్తి చేసే వ్యవసాయ పంటలు, వనరులు, వనజన్య ఉత్పత్తులు, హస్తకళలు మరియు చిన్న తరహా పరిశ్రమల ఉత్పత్తులను నేరుగా మార్కెట్‌కు చేరవేసే వేదికగా ఇది పనిచేస్తుంది. గిరిజనులు మధ్యవర్తుల అవలంబన లేకుండా తగిన ధరకు తమ ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం కలుగుతుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, గిరిజన యువతకు వ్యాపార అవకాశాలు కూడా లభిస్తాయి. భవిష్యత్తులో ఇలాంటి కేంద్రాలు మరిన్ని ప్రాంతాల్లో స్థాపించి, గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే మా ప్రభుత్వ లక్ష్యం” అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సదా భార్గవి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ… నల్లమల అడవుల్లో నివసిస్తున్న చెంచు గిరిజనుల సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలను అందిపుచ్చుకొని చెంచులు అందరు అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ, ఐటీడీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News