-దివంగత మహానేతకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఘన నివాళి…
-రాజన్న పాలన ఒక స్వర్ణ యుగం
-వైఎస్సార్ కీర్తి అజరామరం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ప్రజలకు మేలు చేసిన నాయకుల్లో వైఎస్సార్ మొదటి స్థానంలో నిలుస్తారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. దివంగత మహానేత 12వ వర్ధంతి సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు పలు డివిజన్ లలో పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో గౌరవ శాసనసభ్యులు మల్లాది విష్ణు పాల్గొని.. రాజశేఖర్ రెడ్డి చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని తన కుటుంబంగా భావించిన ప్రజానాయకులు రాజశేఖర్ రెడ్డి అని కీర్తించారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి బాటలు వేసిన ఏకైక ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు. కుల, మత, పార్టీ, బేధం లేకుండా పేదలకు సంక్షేమ పాలన అందించారని కొనియాడారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ అందించిన ఘనత ఆ మహానేతకే దక్కుతుందన్నారు. మహిళా సాధికారతకి వైఎస్సార్ తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమన్నారు. కనుకనే సామాన్యుల నుంచి మేధావుల వరకు అందరి మన్ననలు పొందుతూ సుస్థిర పాలన అందించారన్నారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ నాయకులు డాక్టర్ వైఎస్సార్ అని చెప్పుకొచ్చారు.
సంక్షేమానికి చిరునామా.. వైఎస్సార్
దేశంలో సంక్షేమానికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఎందరికో అసాధ్యమయిన అనేక అభ్యుదయ పథకాలను సుసాధ్యం చేసి సంక్షేమ రథసారథిగా తెలుగు రాజకీయ యవనికపై తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతాంగానికి ఉచిత విద్యుత్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలకు ఆయనే ఆద్యులు అని తెలియజేశారు. వ్యవసాయం దండగంటూ చంద్రబాబు ఈసడించినా.. దానిని పండగ చేసి అన్నదాతల మోముపై చిరునవ్వులు విరబూయించిన నాయకులు వైఎస్సార్ అని చెప్పుకొచ్చారు. కోటి ఎకరాలకు నీళ్లందించి రాష్ట్రాన్ని సుభిక్షం చేయడానికి జలయజ్ఞం కింద 84 ప్రాజెక్టులను చేపట్టి సింహభాగం పూర్తి చేశారన్నారు. ఆయన హయాంలో రూపుదిద్దుకున్న పలు సాగునీటి ప్రాజెక్టులు ప్రస్తుతం జలకళను సంతరించుకున్నాయన్నారు. లక్షలాది మంది నిరుపేదలకు పట్టాలు ఇచ్చి, పక్కాగృహాలు నిర్మించి ఇచ్చారన్నారు.
కృష్ణా జిల్లా వాసుల గుండెల్లో ఆయనది చెరిగిపోని స్థానం…
కృష్ణా జిల్లాతో మరీముఖ్యంగా విజయవాడ నగరంతో వైఎస్సార్ కి విడదీయరాని అనుబంధం ఉందని మల్లాది విష్ణు అన్నారు. కృష్ణా డెల్టా ఆధునికీకరణ, ట్రిపుల్ ఐటీ నిర్మాణం, బందర్ పోర్టు శంకుస్థాపన.. ఇలా ఆయన ఆరేళ్ల పాలనలో 60 ఏళ్ళ ప్రగతిని చూపారన్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను విజయవాడ వేదికగా వైఎస్సార్ ప్రారంభించారన్నారు. ఆరోగ్యశ్రీ సెకండ్ ఫేజ్ సేవలను సెంట్రల్ నియోజకవర్గంలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం నుంచే ప్రారంభించారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తుచేశారు.
వైఎస్సార్ స్పూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం…
వైఎస్ రాజశేఖరరెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నాయకులు, అభిమానులు పెద్దసంఖ్యలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. మహిళలకు చీరలు, పేదలకు పండ్లను పంచిపెట్టారు. గుణదలలో స్థానిక కార్పొరేటర్ ఉద్దంటి సునీత సురేష్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రారంభించారు. వైఎస్సార్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్లడమే.. వైఎస్సార్ కి మనం అర్పించే నిజమైన నివాళి అని తెలిపారు. అనంతరం ప్రకాష్ నగర్ లో స్థానిక కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రజాసంక్షేమంలో తండ్రిని మించిన తనయుడు జగన్మోహన్ రెడ్డి…
వైఎస్సార్ స్ఫూర్తితో ప్రజాభ్యుదయమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం రాజన్న ఒక అడుగు ముందుకు వేస్తే.. ఆయన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నారని అన్నారు. ప్రతి అడుగులోనూ జగన్మోహన్ రెడ్డి .. రాజనన్నను గుర్తుకు తెస్తున్నారన్నారు. ఆ మహానేత శరీరానికి మరణం ఉంటుంది కానీ, ఆయన జ్ఞాపకాలకు, పథకాలకు ఎప్పుడూ మరణం ఉండదని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు.