Breaking News

‘సేనతో సేనాని’ సభకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ప్రాంగణంగా నామకరణం

– ఐదు ప్రధాన ద్వారాలకు ఉత్తరాంధ్ర మహనీయుల పేర్లు
– జనసేన పార్టీ ఎల్లప్పుడు జాతీయ నాయకులను, మహనీయులను స్మరించుకుంటుంది
– మూడు రోజుల సమావేశాలతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం
– తుది దశకు చేరుకున్న ఏర్పాట్లు
– విశాఖపట్నంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి  నాదెండ్ల మనోహర్ 

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
‘జనసేన పార్టీ జన సైనికుల పోరాటాలు, వీర మహిళల తెగింపుతో ముందుకు నడుస్తున్న పార్టీ. జనసేన పార్టీకి మొదటి నుంచి వారే మూలధనం. ఈ నెల 28, 29, 30 తేదీల్లో విశాఖ వేదికగా మూడు రోజులు పాటు నిర్వహించే విస్తృత స్థాయి సమావేశాల్లో ప్రతి ఒక్క కార్యకర్తను గౌరవించుకోవాలని, పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారితో మమేకం కావాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు’ అని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్  చెప్పారు. జనసేన పార్టీకి ఎంతో కీలకమైన మూడు రోజుల సమావేశాల్లో 30వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రాబోయే క్రియాశీలక కార్యకర్తలతో ఇందిరా ప్రియదర్శిని మైదానం వేదికగా జరగబోయే సభ ప్రాంగణానికి మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు సభా ప్రాంగణంగా పేరును అధ్యక్షులు పవన్ కళ్యాణ్  నిర్ణయించినట్లు చెప్పారు. విశాఖపట్నం ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఆడిటోరియంలో బుధవారం సాయంత్రం మనోహర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ.. ” సభా ప్రాంగణానికి వచ్చే ఐదు ప్రధానమైన ద్వారాలకు ఉత్తరాంధ్ర ప్రాంత మహనీయుల పేర్లను పవన్ కళ్యాణ్  నిర్ణయించారు. సభా ప్రాంగణానికి వచ్చే ఐదు ద్వారాలకు తెన్నేటి విశ్వనాథం, కోడి రామ్మూర్తి, గురజాడ అప్పారావు,  వీరనారి గున్నమ్మ, మహాకవి పేర్లను పవన్ కళ్యాణ్  ఖరారు చేశారు.
28వ తేదీ ఉదయం నుంచి సమావేశాలు వరుసగా జరుగుతాయి. మొదట పార్లమెంటరీ పార్టీ సమావేశం, తర్వాత ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశం ఉంటుంది. 29వ తేదీన సేనతో సేనాని పేరుతో 25 జిల్లాల్లో పార్టీతో మమేకమైన వారితో పవన్ కళ్యాణ్  ప్రత్యేకంగా సమావేశం అవుతారు. దీనిలోనే మేధావులు, విద్యావంతులు, వివిధ వర్గాల నుంచి వచ్చే యువతతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. 30వ తేదీన ఇందిరా ప్రియదర్శిని మైదానంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే క్రియాశీలక కార్యకర్తలతో సమావేశం ఉంటుంది. ఇప్పటికే సమావేశానికి ఆహ్వానించే వారికి డిజిటల్ పాసులను పంపించాం. అలాగే మ్యాన్యువల్ పాసులను కూడా అందజేస్తాం. వాతావరణం అనుకూలించకపోయినా ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. పూర్తిస్థాయిలో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా పూర్తి సమన్వయంతో నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూడు రోజుల సమావేశాల్లో పార్టీ భవిష్యత్తు ప్రణాళిక, కార్యాచరణను పవన్ కళ్యాణ్ నిర్దేశిస్తారు. జనసేన పార్టీ శ్రేణులకు ఈ సమావేశాలు కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి.” అన్నారు.
ఈ సమావేశంలో శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్,  సుందరపు విజయ్ కుమార్, బత్తుల బలరామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్, లోకం నాగ మాధవి, అరవ శ్రీధర్, విశాఖ జిల్లా డిసిసిబి చైర్మన్  కోన తాతారావు, తెలంగాణ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, జీవీఎంసీ డెప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *